Banaganapalle: ప్రముఖ చరిత్రకారుడు శివనాగిరెడ్డిని కలిసిన బిసి రాజారెడ్డి
Banaganapalle: హైదరాబాద్‌లో ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని బనగానపల్లె మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి కలిసి బనగానపల్లె చారిత్రక వైభవంపై చర్చించారు.
Banaganapalle: ప్రముఖ చరిత్రకారుడు శివనాగిరెడ్డిని కలిసిన బిసి రాజారెడ్డి
నంద్యాల జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి గారిని బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్, అరుణ భారతి సాహితీ సంస్థ అధ్యక్షులు బిసి రాజారెడ్డి కలిశారు. హైదరాబాదులో శివనాగిరెడ్డి గారిని కలిసిన బిసి రాజారెడ్డి పురాతన, చారిత్రాత్మక సంఘటనకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బిసి రాజారెడ్డి మాట్లాడుతూvశివ నాగిరెడ్డి గారు అనేక చారిత్రక , పురాస్థలాల తవ్వకాల్లో పాల్గొనడంతో పాటు ముంపునకు గురైన ఎన్నో పురాతన ఆలయాలను వెలుగులోకి తీసుకొచ్చి ఎగువకు తరలించి పునర్నిర్మించారన్నారు
చరిత్ర , శాసనాలు, పురాతన స్థలాలు, కట్టడాలు, ఆలయాలు, బౌద్ధ, జైన స్థావరాలపై అనేక పుస్తకాలు రాశారన్నారు. మహాబలిపురం కి చెందిన పద్మశ్రీ వి.గణపతి స్థపతిచే వాస్తు శిల్పవాచస్పతి అనే బిరుదును పొందారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం కళారత్న అవార్డును సొంతం చేసుకున్నారని తెలిపారు. అలాగే తెలంగాణ సారస్వత పరిషత్ వారి సురవరం ప్రతాపరెడ్డి సాహితీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారన్నారు.
చరిత్రకారుడు శివనాగిరెడ్డి గారినిని కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే తాను సేకరించిన పురాతన నాణేలు, పుస్తకాలు గురించి ఆయనకు వివరించగా అభినందించడం జరిగిందన్నారు. రాబోవు భవిష్యత్ తరాల వారికి అవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బనగానపల్లె మండలం జోలాపురం గ్రామానికి ఎంతో పూర్వ చరిత్ర ఉందని శివ నాగిరెడ్డి గారు తెలిపారన్నారు.
పూర్వం 71 వేల సంవత్సరాల కిందట ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలి దాని నుంచి వచ్చే లావా ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో పడిందన్నారు. అందులో జోలాపురం గ్రామం ఒకటన్నారు. లావా పడే సమయంలో అక్కడ నివసించే చాలామంది యాగంటి కొండలపైకి వెళ్లి ప్రాణాలు రక్షించుకోగా మరికొందరు సజీవ దహనం అయ్యారని, వాటికి సంబంధించిన ఆధారాలు, జంతువులు, మానవ అవశేషాలు బయటపడ్డాయని వాటిని జాగ్రత్తగా కాపాడడం జరుగుతోందని శివనాగిరెడ్డి గారు వివరించారు.
బనగానపల్లె చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితం అవుకు మండలం రామాపురంలో భారత దేశంలోని మొట్టమొదటిసారిగా కంకర రోడ్డు వేసినట్లు చరిత్ర లో ఆధారాలు లభించాయని తెలిపారు. త్వరలోనే బనగానపల్లె ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తానని శివనాగిరెడ్డి తెలిపినట్లు బిసి రాజారెడ్డి పేర్కొన్నారు.




