Kurnool: నాటక రంగానికి బళ్ళారి రాఘవ సేవలు స్ఫూర్తిదాయకం: డీఆర్వో!

Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో ఘనంగా తెలుగు నాటక రంగ పితామహుడు బళ్ళారి రాఘవ జయంతి వేడుకలు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 2 Aug 2026 1:38 PM IST
Kurnool
X

Kurnool: నాటక రంగానికి బళ్ళారి రాఘవ సేవలు స్ఫూర్తిదాయకం: డీఆర్వో!

Kurnool: జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు సెట్కూర్ వారి ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ అధ్యక్షతన కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌నందు తెలుగు నాటక రంగ పితామహుడు, మహానటుడు బళ్ళారి రాఘవ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి.

కార్యక్రమ ప్రారంభంలో బళ్ళారి రాఘవ చిత్రపటానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేసి దీప ప్రజ్వలన కార్యక్రమాలు జరిపి నివాళులర్పించారు. అనంతరం ఆయన కళా ప్రస్థానం, దేశభక్తి, సామాజిక చైతన్యం, తెలుగు నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక సభ నిర్వహించారు.

జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ, బళ్ళారి రాఘవ కళను సమాజ చైతన్యానికి సాధనంగా మలిచిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. మహిళలు, యువత కళా రంగంలో ముందుకు రావడానికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. సాంస్కృతిక విలువలను కాపాడుతూ తెలుగు భాష, సాహిత్యాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

లలిత కళా సమితి సాంస్కృతిక సంఘం అధ్యక్షులు పత్తి ఓబులయ్య,మాట్లాడుతూ, బళ్ళారి రాఘవ కేవలం నటుడు మాత్రమే కాదని, తెలుగు సంస్కృతికి జీవం పోసిన మహానుభావుడని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటక కళను ప్రోత్సహించడం ద్వారా యువతలో సృజనాత్మకత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందుతుందని తెలిపారు. కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కనుసుకర కరణ్ మాట్లాడుతూ, తెలుగు సినిమా మరియు నాటక రంగాలు ఒకే మూలాల నుంచి అభివృద్ధి చెందాయని అన్నారు. బళ్ళారి రాఘవ వంటి మహానటుల సేవలను గుర్తు చేసుకోవడం ద్వారా నేటి తరం కళాకారులకు దిశానిర్దేశం లభిస్తుందని పేర్కొన్నారు. తెలుగు కళా సంప్రదాయాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించేందుకు ఫిలిం ఛాంబర్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి మరియు సెట్కూర్ సీఈఓ డాక్టర్ కె. వేణుగోపాల్ మాట్లాడుతూ, యువతలో కళలు, సంస్కృతి, భాష, సాహిత్యంపై అభిరుచి పెంపొందించడం యువజన సంక్షేమ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బళ్ళారి రాఘవ వంటి మహనీయుల జయంతి కార్యక్రమాలు యువతలో విలువలు, సేవాభావం, దేశభక్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి వారికి తగిన వేదికలు కల్పించేందుకు జిల్లా యువజన సంక్షేమ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

డీవీఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, బళ్ళారి రాఘవ సేవలు తెలుగు నాటక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కళ అనేది వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో విలువలు, నైతికత, దేశభక్తి, మానవతా దృక్పథాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. యువత నాటక రంగం, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంపొందించుకొని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బళ్ళారి రాఘవ ఆశయాలను కొనసాగించడం ప్రతి కళాకారుడి సామాజిక బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు, సినీ మరియు రంగస్థల కళాకారులు, సాహితీవేత్తలు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, కళాభిమానులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story