Allagadda: ఆళ్లగడ్డ రాజకీయం గంగుల బ్రిజేంద్రారెడ్డికి భూమా సవాల్
Allagadda: అహోబిలం దేవస్థానంలో అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటు కౌంటర్. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని గంగుల బ్రిజేంద్రారెడ్డికి సవాల్.
Allagadda: ఆళ్లగడ్డ రాజకీయం గంగుల బ్రిజేంద్రారెడ్డికి భూమా సవాల్
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలు మరోసారి హీట్‌ఎక్కాయి. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి చేసిన ఆరోపణలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అహోబిలం దేవస్థానంలో జరిగిన అవినీతికి గంగుల బ్రజేంద్ర రెడ్డే బాధ్యత వహించాలని ఆరోపించారు. తనపై చేసిన ప్రతి ఆరోపణను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు.
మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. ఆధారాలు లేకుండా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అహోబిలంలో జరిగిన అక్రమాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు గతంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలని ఆరోపించారు. ప్రస్తుతం టెండర్లు ఇతరులకు వెళ్లడంతోనే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తాను ఎప్పుడూ ఆధారాలు లేకుండా ఎవరిపైనా మాట్లాడలేదని, తనపై ఆరోపణలు చేసిన గంగుల బ్రిజేంద్రారెడ్డి కూడా స్పష్టమైన ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అహోబిలం దేవస్థానంలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశామన్న ఆరోపణలను కూడా అఖిలప్రియ ఖండించారు. దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగుల పూర్తి జాబితా బయటపెడితే ఎవరి హయాంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రజలకు స్పష్టమవుతుందని అన్నారు.
మఠంలో జరుగుతున్న టెండర్ల వ్యవహారాలపై కూడా ఎమ్మెల్యే అఖిలప్రియ అనుమానాలు వ్యక్తం చేశారు. సీసీ కెమెరా టెండర్లు, తలనీలాల టెండర్లు, వెండి-బంగారం వ్యవహారాలపై విచారణ జరిపించాలని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తాను తప్పు చేసి ఉంటే స్వయంగా విచారణ కోరే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు.
గంగుల బ్రిజేంద్రారెడ్డి వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం కాకుండా, ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఆధారాలు నిరూపించలేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టోల్‌గేట్ ఆదాయంపై వస్తున్న ఆరోపణలకు కూడా అఖిలప్రియ సమాధానం ఇచ్చారు. టోల్‌గేట్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం అహోబిలం అభివృద్ధికే వినియోగిస్తున్నామని చెప్పారు. షెల్టర్లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలన్నీ అదే ఆదాయంతో నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.
అహోబిలం వ్యవహారాలపై ఇప్పటికే మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి విషయాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా బదులివ్వడంతో ఆళ్లగడ్డ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అహోబిలం దేవస్థానం వ్యవహారంపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




