Kurnool: రూపాయిని మూడు రూపాయలు చేస్తాడట.. రంగంలోకి దిగిన పోలీసులు!
Kurnool: డబ్బులు మూడింతలు చేస్తామనే మోసపూరితమైన ట్రిక్స్ నమ్మి సామాన్య ప్రజలు మోసపోవద్దని వెల్దుర్తి సీఐ యుగంధర్ హెచ్చరించారు.
Kurnool: రూపాయిని మూడు రూపాయలు చేస్తాడట.. రంగంలోకి దిగిన పోలీసులు!
కర్నూలు జిల్లా: బేలగల్ మండలం , బ్యాతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేష్ అనే వ్యక్తి లక్ష రూపాయలు తీసుకుని, వాటిని మూడింతలు చేసి మూడు లక్షలు ఇస్తానని చెప్పి ఓ వ్యక్తిని మోసం చేసి పరారీలో తిరుగుతున్నాడు. మోసపోయిన బాధితుడు క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మోసం చేసిన వెంకటేష్ అనే వ్యక్తిని 22.05.2026 తేదీన వెల్దుర్తి గ్రామం శివారులో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కొన్ని కెమికల్స్ ఉపయోగించి సాధారణ నోట్లను నల్లగా మార్చి, వాటిని ప్రత్యేక పద్ధతిలో కెమికల్‌తో కడిగితే అసలు నోట్లుగా మారుతాయని ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నల్లటి కాగితాలను ఇచ్చి, కెమికల్ పేరుతో సాధారణ నీళ్లు అందించేవాడని పేర్కొన్నారు.
బాధితుడు వాటిని కడిగినా నగదుగా మారకపోవడంతో తాను మోసపోయానని గుర్తించి, వెంకటేష్ ఆచూకీ తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అరెస్టు సమయంలో నిందితుడి వద్ద నుండి:
* కొన్ని నల్లటి కాగితాలు
* నల్లగా మార్చిన సాధారణ నోటు
* నగదు రూ.2 లక్షలు
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం డోన్ మెజిస్ట్రేట్ గారి ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. ప్రజలు ఇలాంటి డబ్బులు రెట్టింపు చేస్తామనే మోసపూరిత ట్రిక్స్‌ను నమ్మి మోసపోవద్దని వెల్దుర్తి సీఐ యుగంధర్ హెచ్చరించారు. ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసిన పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య గారిని, వేల్దుర్తి సీఐ యుగంధర్ గారిని, క్రిష్ణగిరి ఎస్సై కృష్ణమూర్తి గారిని మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు అభినందించారు.




