Markapuram: మహిళలే టార్గెట్.. రామచంద్రాపురంలో దొంగల బీభత్సం పోలీసుల గాలింపు
Markapuram: మార్కాపురం మండలం రామచంద్రాపురంలో తెల్లవారుజామున వరుస చైన్ స్నాచింగ్స్ జరిగాయి.
Markapuram: మహిళలే టార్గెట్.. రామచంద్రాపురంలో దొంగల బీభత్సం పోలీసుల గాలింపు
మార్కాపురం: మార్కాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలో తెల్లవారుజామున జరిగిన వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు గ్రామంలో తీవ్ర కలకలం రేపాయి. ఇంటి ముందు నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడల్లో ఉన్న బంగారు గొలుసులను గుర్తుతెలియని దుండగులు అపహరించి పరారయ్యారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, ఈ ఘటనలు ఈరోజు తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో చోటుచేసుకున్నాయి.
మొదటి ఘటనలో వెంకట లక్ష్మమ్మ (37), భర్త ఎల్లయ్య, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆమె ఇంటి ముందు వరండాలో మంచంపై నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు సరడును లాక్కొని పారిపోయాడు. అలాగే రెండో ఘటనలో దేవవరపు కోటమ్మ (70), భర్త చిన్న వెంకటరెడ్డి, తమ ఇంటి ముందు వేపచెట్టు కింద మంచంపై నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న సుమారు 25 గ్రాముల బంగారు గొలుసును దుండగులు అపహరించారు.
ఒకే గ్రామంలో వరుసగా జరిగిన ఈ రెండు ఘటనలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సీఐ అల్తాఫ్ హుస్సేన్, పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి వెంటనే గ్రామానికి చేరుకుని ఘటన స్థలాలను పరిశీలించి బాధితులను విచారించారు.దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




