Kurnool: నగర అందాన్ని పాడుచేస్తే జైలుకే.. పోస్టర్లు అతికించే వారిపై కమిషనర్ ఫైర్!
Kurnool: నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులను పాడుచేస్తూ పోస్టర్లు, బ్యానర్లు అతికించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.
Kurnool: నగర అందాన్ని పాడుచేస్తే జైలుకే.. పోస్టర్లు అతికించే వారిపై కమిషనర్ ఫైర్!
Kurnool: నగరాన్ని అందంగా, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా లక్షల రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న సుందరీకరణ పనులపై పోస్టర్లు, బ్యానర్లు అతికించి పాడు చేసే వారిపై ఉదాసీన వైఖరి ప్రదర్శించవద్దని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. బళ్ళారి చౌరస్తా వద్ద ఇటీవల జాతీయ రహదారి రిటైనింగ్ వాల్‌పై రంగులు వేసి అందంగా తీర్చిదిద్దగా, కొందరు పోస్టర్లు అతికించి పాడు చేశారు. అలాగే డివైడర్లకు పోస్టర్లు అతికించి అపరిశుభ్రంగా మార్చారు. సోమవారం సదరు ప్రాంతాలను సందర్శించిన కమిషనర్, సంబంధిత వ్యక్తులకు కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించాలని, లేకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బ్యానర్లు, పోస్టర్లు అతికించే వారిపై ఎలాంటి ఉదాసీన వైఖరి తగదని, కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భారీ జరిమానాలు విధించడంతోపాటు అవసరమైతే కేసులు సైతం నమోదు చేయాలని ఆదేశించారు. ఫ్లెక్సీల ప్రింటింగ్ నిర్వాహకులు, బ్యానర్లు అతికించే వారితో త్వరలో సమావేశం నిర్వహించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత పనులకు ఆటంకం కలిగిస్తున్న సమస్యలను ఇంజనీరింగ్ విభాగ అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలని నోడల్ అధికారి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.




