Kurnool: రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం వద్దు కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

Kurnool: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంయుక్త తనిఖీలు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 May 2026 5:34 PM IST
Kurnool
X

Kurnool: రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం వద్దు కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గుర్తించిన బ్లాక్ స్పాట్ ల వద్ద అవసరమైన ఏర్పాట్లు, మరమ్మతులు, నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని పట్టణంలోని నూతన బైపాస్ రోడ్ పరిధిలో ఉన్న బ్లాక్ స్పాట్లను జిల్లా కలెక్టర్ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే, రవాణా, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, ప్రజల ప్రాణ రక్షణ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆదోని వై జంక్షన్ నుండి ఆలూరు బైపాస్ వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర నూతన రహదారి నిర్మాణం చేపట్టినప్పటికీ, ఇంకా కొన్ని కీలకమైన పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

ముఖ్యంగా జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ పనులు, వర్షపు నీటి పారుదల కోసం సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్ తీగల మార్పిడి, రోడ్డు భద్రత సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, సైడ్ సిగ్నల్స్, స్పీడ్ వార్నింగ్ బోర్డులు వంటి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన పనులను వేగవంతం చేయడానికి రెవెన్యూ, నేషనల్ హైవే, రవాణా మరియు పోలీసు శాఖలతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి శాఖ నిర్దేశించిన గడువు లోపు పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు సూచించిన అభివృద్ధి, రోడ్డు భద్రత పనులను కూడా ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తామని పేర్కొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులు కలిసి ఆదోని బైపాస్, ఆరెకల్, బనవాసి, చిలకలడోన, మంత్రాలయం మార్గంలోని ప్రమాదకర బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రహదారి పరిస్థితులు, ట్రాఫిక్ ప్రవాహం, హెచ్చరిక సూచికల అవసరం, ప్రమాదాల కారణాలు వంటి అంశాలను సమీక్షించి, తక్షణ భద్రతా చర్యలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా రహదారుల అభివృద్ధితో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్.ఈ మహేశ్వర్ రెడ్డి, ఆదోని (ఇంచార్జ్) సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఆదోని డి.ఎస్.పి (ఇంచార్జ్) భార్గవి, రవాణా శాఖ అధికారి భరత్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, దీప్తి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story