Kurnool: విద్యార్థుల భవిష్యత్తే సమాజ అభివృద్ధికి పునాది: కలెక్టర్!

Kurnool: కర్నూలు జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదల, డ్రాప్‌అవుట్‌ల తగ్గింపుపై కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Aug 2026 4:58 PM IST
Kurnool
X

Kurnool: విద్యార్థుల భవిష్యత్తే సమాజ అభివృద్ధికి పునాది: కలెక్టర్!

కర్నూలు: జిల్లాలో విద్యా రంగం అభివృద్ధి లో భాగంగా కీలక సూచికలు (Critical Indicators) ప్రతి అంశంలో గణనీయమైన పురోగతి సాధించేలా సంబంధిత శాఖల అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు (MEOలు), ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని, అదే సమాజ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో విద్యా రంగంలోని కీలక సూచికల పురోగతి, విద్యా నాణ్యత మెరుగుదలపై సంబంధిత శాఖల అధికారులు, స్టేక్‌హోల్డర్లతో నిర్వహించిన హై లెవల్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణం, మెరుగైన బోధన, పోషకాహారం అందించడం ద్వారా భావితరాలకు బలమైన పునాది వేయవచ్చన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు విద్య, యువత, మానవ వనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని, అదే దిశగా జిల్లాలోనూ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

పాఠశాల ప్రవేశాలు, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ గుర్తింపు ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పురోగతిని వేగవంతం చేసి వారం రోజుల్లోగా 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండల విద్యాశాఖ అధికారి తన పరిధిలోని అన్ని పాఠశాలలను సమర్థవంతంగా పర్యవేక్షించడంతో పాటు పనితీరు తక్కువగా ఉన్న ప్రధానోపాధ్యాయులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పాఠశాలలతో పాటు వెనుకబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

మండల విద్యాశాఖ అధికారుల పనితీరులో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై అవసరమైతే పరిపాలనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా అధికారులు తమ పనితీరు, దృక్పథంలో మార్పు తీసుకువచ్చి అదే స్ఫూర్తిని ప్రధానోపాధ్యాయుల్లోనూ పెంపొందించాలని సూచించారు.

జిల్లాలో బాలికల డ్రాప్‌అవుట్‌లు అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన కలెక్టర్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు (KGBV) అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో అదనపు వసతుల అవసరం ఉందన్నారు. జిల్లాకు అదనంగా 12 కేజీబీవీలు, 5 బీసీ హాస్టళ్లు, 5 ఎస్సీ హాస్టళ్లు, 5 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు, 100 సీజనల్ హాస్టళ్లు, 10 ఏపీ మోడల్ స్కూళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వలస వెళ్లే కుటుంబాల పిల్లలు విద్యకు దూరం కాకుండా ఉండేందుకు సీజనల్ హాస్టళ్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి వీలైనంత త్వరగా సీజనల్ హాస్టళ్లను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వలసల కారణంగా ఒక్క విద్యార్థి కూడా చదువు మానకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పాఠశాలల డ్రాప్‌అవుట్‌లను 5 శాతం లోపే పరిమితం చేయడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

గతంలో మాదిరిగానే ప్రధానోపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరచాలని, మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసి మంచి ఫలితాలు సాధించినట్లే, విద్యా రంగంలోనూ ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారానే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో పాఠశాలల డ్రాప్‌అవుట్‌లను గణనీయంగా తగ్గించి, విద్యార్థుల నమోదు (Enrolment) శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉన్న పాఠశాలలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుంచి 9.30 గంటలలోపు హాజరు వివరాలను డేటా ఎంట్రీ చేసి ప్రధాన రా కార్యాలయానికి నివేదిక పంపించాలని సూచించారు. ముఖ్యంగా సి.బెళగల్, ఎమ్మిగనూరు, కౌతాళం, కల్లూరు, కోసిగి, కర్నూలు అర్బన్, ఆలూరు, చిప్పగిరి మండలాల్లో ఉపాధ్యాయుల హాజరు 100 శాతం నమోదయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జీఎఫ్‌ఎల్ (GFL) పాఠశాలల కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నమోదు పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

పాఠశాలల మౌలిక వసతులకు సంబంధించిన వివరాలను LEAP యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేసి, ఈ ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన కలెక్టర్, మెనూ ప్రకారం అందిస్తున్న భోజన వివరాలను ప్రతిరోజూ తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూపుల్లో పంచుకోవాలని సూచించారు.

విద్యార్థులకు సంబధించిన పాఠ్యాంశాల నిర్వహణ, యాక్టివిటీస్, మెదలగు కార్యక్రమాలను తల్లిదండ్రులకు చేరవేసేందుకు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.మండల స్థాయి అధికారులు పాఠశాలలను తరచూ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

అలాగే జిల్లాలో పాఠశాలలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్.ఓ. ప్లాంట్లు ఎక్కడ పనిచేయడం లేదో సమగ్ర నివేదిక సిద్ధం చేసి, అవసరమైన మౌలిక వసతుల పనులను అత్యవసరంగా పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్, జిల్లా విద్యాధికారి జి. సుధాకర్, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోకరాజు, మండల విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story