Nandyal: జీడీపీ, జీవీఏ వృద్ధే లక్ష్యంగా నంద్యాలలో ప్రత్యేక కార్యాచరణ!
Nandyal: నంద్యాల జిల్లా జీడీపీ, జీవీఏ వృద్ధే లక్ష్యంగా పెహల్ ఇండియా ఫౌండేషన్ బృందంతో కలెక్టర్ జి. రాజకుమారి కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా సదస్సు నిర్వహించారు.
Nandyal: జీడీపీ, జీవీఏ వృద్ధే లక్ష్యంగా నంద్యాలలో ప్రత్యేక కార్యాచరణ!
నంద్యాల: జిల్లా అభివృద్ధికి వ్యవసాయం, పారిశ్రామికం, సేవా రంగాలతో పాటు పర్యాటక రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పెహల్ ఇండియా ఫౌండేషన్/ప్రాజెక్ట్ బృంద సభ్యులు రహీస్, హవిలా, పలక్, ఆర్గ్యా, కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన వివిధ అంశాలను కలెక్టర్ సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు జిల్లాలో మరిన్ని ప్రోసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో దాదాపు మూడో వంతు విస్తీర్ణం నల్లరేగడి నేలలతో ఉండటంతో రైతులు సంప్రదాయ పంటల సాగుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.
అయితే, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఖరీఫ్‌లో మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో రాగి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, అంజూర, ఖర్జూరం వంటి అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగును విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని, నాణ్యమైన ఉత్పత్తులతో నంద్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
పారిశ్రామిక రంగంలో జిల్లాకు ఉన్న ఖనిజ సంపద పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఖనిజ ఆధారిత అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. సేవా రంగం, పర్యాటక రంగాల్లో కూడా నంద్యాల జిల్లాకు విశేష అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, బనగానపల్లి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నప్పటికీ, పర్యాటకులకు మరింత మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులు కేవలం దర్శనం ముగించుకొని వెళ్లిపోకుండా జిల్లాలో కొన్ని రోజులు బస చేసే విధంగా "స్లో టూరిజం"ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు.
అదే విధంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం, సహజ వనరులు, ఔషధ మూలికలను వినియోగించుకుని హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వంటి వైద్య విధానాల ఆధారంగా కొత్త అవకాశాలను సృష్టించవచ్చని కలెక్టర్ వివరించారు. జిల్లా సహజ వనరులు, వ్యవసాయ సామర్థ్యం, పారిశ్రామిక అవకాశాలు, పర్యాటక విశిష్టతలను సమన్వయం చేసుకొని సమగ్ర అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపడితే నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.*
పెహల్ ఇండియా ఫౌండేషన్/ప్రాజెక్ట్ బృందం సభ్యులు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలిపారు. అంతర్-శాఖల సమన్వయం వల్ల పరస్పరం నేర్చుకునే అవకాశం లభించడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
వివిధ శాఖల అధికారులు జిల్లాలోని సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర సమాచారాన్ని అందించడం ద్వారా జిల్లా ప్రొఫైలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న గణాంకాలను క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు గత రెండేళ్లలో చోటుచేసుకున్న మార్పులను విశ్లేషిస్తూ, గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (GVA), గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GDP) వృద్ధికి దోహదపడే కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని వివరించారు.
రాబోయే రెండు రోజుల్లో నియోజకవర్గాల వారీగా ప్రొఫైలింగ్ పూర్తి చేసి, అనంతరం జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులకు GDP, GVA అంశాలపై అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




