Kurnool: కర్నూలు ప్రజలకు అలర్ట్ పైపుల నీరు తాగొద్దు కమిషనర్ కీలక సూచన

Kurnool: కర్నూలు నగరంలోని 28వ వార్డు పరిధిలో తాగునీటి సరఫరాను మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు.

V RAMAMOHAN, KURNOOL
Updated on: 2 May 2026 12:34 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు ప్రజలకు అలర్ట్ పైపుల నీరు తాగొద్దు కమిషనర్ కీలక సూచన

కర్నూలు: నగరంలోని 28వ వార్డు పరిధిలోని లక్ష్మీపురం, పందిపాడు, దూపాడు, అశ్వత్థపురం గ్రామాల ప్రజలు తమ వీధుల్లో ఏర్పాటు చేసిన సింటెక్స్ ట్యాంకులు, మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటినే తాగునీటిగా వినియోగించాలని, పైప్‌లైన్ ద్వారా వచ్చే నీటిని ఇతర అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. శనివారం ఆయన లక్ష్మీపురం గ్రామంలో నీటి సంగ్రహ బావులు, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వేసవికాలం కారణంగా హంద్రీ నదిలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిందన్నారు. ఇన్‌ఫిల్ట్రేషన్ బావుల ద్వారా సేకరించే నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నప్పటికీ, ప్రజలకు మరింత స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హంద్రీ నుంచి నీటి సరఫరా పొందుతున్న ఈ గ్రామాలకు ప్రతిరోజూ ప్రత్యేక మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. సింటెక్స్ ట్యాంకుల్లో నిల్వ చేసిన నీటినే తాగునీటిగా వినియోగించాలని, ఇంటి అవసరాలు, శుభ్రపరిచే పనులు, ఇతర సాధారణ అవసరాలకు మాత్రమే పైప్‌లైన్ నీటిని ఉపయోగించాలని స్పష్టం చేశారు.

అంతకుముందు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, గణేష్ నగర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈ నరేష్, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఎంజల్ ప్రణీత, అమినిటీస్ కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story