Atmakur: ప్రైవేట్ హోమాలతో దేవుడి క్షేత్రంలో రాజకీయం.. ఆత్మకూరులో పెను దుమారం

Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల పరిధిలోని శ్రీ కొలను భారతి సరస్వతి క్షేత్రంలో వివాదం రేగింది.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 23 Jun 2026 5:33 PM IST
Atmakur
X

Atmakur: ప్రైవేట్ హోమాలతో దేవుడి క్షేత్రంలో రాజకీయం.. ఆత్మకూరులో పెను దుమారం

Atmakur: దేశంలో రెండవ సరస్వతి క్షేత్రం .. నవ్యాంధ్రలో ఏకైక చదువుల తల్లి సరస్వతి ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల యజ్ఞ యాగ హోమాల తంతు పెరిగిపోతుంది. ఏడు మాసాల క్రితం నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల లో ఉన్న శ్రీ కొలను భారతి సరస్వతి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ శ్రీశైల దేవస్థానం దత్తత ఆలయంగా స్వీకరించింది.

అప్పటినుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి, పాలకమండలి, కొలను భారతీ క్షేత్ర విభాగ ఉప అధికారులు, వైదిక కమిటీ అనుమతులు కావాలి. కానీ అలాంటి అనుమతులు ఏవి లేకుండానే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటున్న ఓ ప్రవాస ఆంధ్రుడు కుటుంబ సమేతంగా కొలను భారతి క్షేత్రంలో నవ చండీ హోమాన్ని నిర్వహించారు.

ఆ హోమం కూడా స్థానిక ఆలయ అధికారిక అర్చకులకు సంబంధం లేకుండా బయటినుంచి ఓ 9 మంది ప్రైవేటు బ్రాహ్మణుల బృందాన్ని రప్పించి నాలుగు గంటలకు పైగా చండీ హోమాన్ని నిర్వహించారు.

మొదట క్షేత్రంలోని ఓ ప్రైవేటు సత్రంలో ఏర్పాటు చేసుకున్న హోమాన్ని ఉదయం 10 గంటలకు గర్భాలయ ఎదురుగా ముఖ మండపంలో హోమ గుండాన్ని ఏర్పాటుచేసి నవ చండీ హోమాన్ని లోక కళ్యాణార్థం, ఈ దేశ సుభిక్షం కోసం నిర్వహిస్తున్నామని అన్నారు. శ్రీశైల దేవస్థాన అధికారుల అనుమతులు ఉంటే ప్రైవేటు సత్రంలో నిర్వహిస్తున్నామని, ఓ సామాజిక వర్గం భక్తులు హాజరుకావాలని సాంఘీక మాధ్యమాలలో ఎందుకు ప్రచారం చేసారని భక్తులు ప్రశ్నించారు.

అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని, శ్రీశైల దేవస్థానం అధికారులు చండీ హోమం ఏర్పాట్లపై ఆదేశాలు ఇవ్వలేదని స్థానిక అర్చకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే శ్రీశైల పాలకవర్గ ధర్మకర్తల మండలి లోని ఓ సభ్యుడు తన నోటి మాటగా కొలను భారతీ ఆలయంలో చండీ హోమం ఏర్పాటు చేసుకున్నందుకు అనుమతిచ్చారని ప్రవాస ఆంధ్రుడు అంటున్నాడు.. అయితే అందుకు తగిన రాతపూర్వక లేఖలను మాత్రం చూపించలేదు. స్థానిక అధికారిక అర్చకులపై మండిపడ్డాడు సదరు ఎన్నారై.

దీంతో భక్తులు విస్తు పోయారు. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా తమకు డిప్యూటీ సీఎం కార్యాలయంలో ముఖ్యమైన వారు తెలుసని అవసరమైతే వారితో మాట్లాడతామని అంటున్నారు. గతంలో గోదావరి జిల్లాలకు చెందిన ఓ మహిళ తాను ఐఏఎస్ అధికారిని అంటూ .. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తనకు తెలుసనీ ఈ తరహా ప్రైవేటు హోమాలు నిర్వహించి హల్ చల్ చేసింది. ప్రశ్నించిన ఓ పీఠాధిపతిని సైతం బెదిరించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులు ఈ క్షేత్రంలో అర్దరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించిన సంఘటనలు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి.

కొలనుభారతి సరస్వతి క్షేత్రంలో ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు బ్రాహ్మణుల బృందంతో నిర్వహించిన వ్యక్తిగత నవ చండీ హోమం పెను దుమారం లేపింది. అధికారుల అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న యజ్ఞాలు, హోమాలు ఎలా నిర్వహిస్తారని భక్తులు మండిపడుతున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారులు మున్ముందు శ్రీ కులం భారతీ క్షేత్రంలో ఈ తరహా ప్రైవేటు హోమాలకు ప్రైవేట్ వ్యక్తులకు అనుమతులు నిరాకరించాలని భక్తులు కోరుతున్నారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story