Kurnool: దేవనకొండలో 20 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు కొట్టివేత!

Kurnool: దేవనకొండకు చెందిన 20 మందిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నేరం రుజువు కాకపోవడంతో న్యాయస్థానం కొట్టివేసిందని సీనియర్ న్యాయవాది సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

G Jagadeesh, Pathikonda
Published on: 7 Oct 2026 11:13 PM IST
Kurnool
X

Kurnool: దేవనకొండలో 20 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు కొట్టివేత!

కర్నూల్: దేవనకొండకు చెందిన 20 మంది నిందితులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కోర్టు కొట్టివేసినట్లు లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్, సీనియర్ న్యాయవాది మద్దూరు సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

2022లో దేవనకొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 106/2022 కింద బొబ్బ మల్లికార్జునతో పాటు మరో 19 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 20 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువకులు దాదాపు నాలుగేళ్లుగా కోర్టు వాయిదాలకు హాజరవుతూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

బుధవారం కేసు విచారణ అనంతరం నేరం రుజువు కాకపోవడంతో ఎస్సీ, ఎస్టీ కోర్టు గౌరవ జిల్లా జడ్జి కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారని సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. ఈ కేసులో నిందితుల తరఫున తానే న్యాయవాదిగా వాదనలు వినిపించినట్లు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు పరస్పరం సఖ్యతతో ఉంటూ గొడవలు, కేసులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఎవరిపైనైనా అక్రమంగా కేసులు నమోదు చేస్తే భయపడకుండా పోలీసు ఉన్నతాధికారులను లేదా న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు.

రాజకీయ కక్ష సాధింపులకు కొందరు నేతలు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రత్యర్థులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టిస్తున్నారని, తద్వారా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. అయితే చట్టం దుర్వినియోగంపై వచ్చే ఆరోపణలను సంబంధిత అధికారులు, న్యాయస్థానాల పరిశీలనకు లోబడి చూడాల్సి ఉంటుందని తెలిపారు.

అక్రమ కేసుల్లో ఇరుక్కున్న బాధితులకు లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని సీనియర్ న్యాయవాది సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda