Alur: వేదవతి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి: సీపీఐ డిమాండ్!

Alur: ఆలూరులో సీపీఐ మండల సమితి సమావేశం. వేదవతి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేసి 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని డిమాండ్.

Bheemalinga, Aluru
Published on: 11 Oct 2026 6:33 PM IST
Alur
X

Alur: వేదవతి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి: సీపీఐ డిమాండ్!

Alur: కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన వేదవతి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వాసవి కళ్యాణ మండపంలో సీపీఐ మండల సమితి సమావేశం మండల కార్యదర్శి ఎస్.ఎస్. భాష అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దిలేటి శెట్టి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. భూపేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేదవతి నది వరద జలాలను వినియోగించుకునేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆలూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాల్లో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సాగునీరు అందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అయితే, పనులు ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా మెరుగైన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ చేపట్టరాదని, పరిహారం చెల్లింపుల్లో జాప్యం చేయకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. అవసరమైన పునరావాస సదుపాయాలు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసి, నిలిచిపోయిన పనులను వేగవంతం చేయాలని అన్నారు.

పంపింగ్ కేంద్రాలు, పైపులైన్లు, జలాశయాలు, కాలువల నిర్మాణ పనులను సమన్వయంతో పూర్తి చేసి, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపుల వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడుతున్న ఆలూరు ప్రాంత రైతులు తరచూ కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, సాగునీటి సౌకర్యం లేక పంటలు, దిగుబడులు దెబ్బతింటున్నాయని నాయకులు తెలిపారు. వేదవతి ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీటి భరోసా లభించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రాజెక్టు పనులు ప్రారంభించే వరకు రైతుల పక్షాన సీపీఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ ఆలూరు మండల సహాయ కార్యదర్శి చంద్రకాంత్ రెడ్డి, హొళగుంద మండల కార్యదర్శి మారెప్ప, ఏఐటీయూసీ ఆలూరు తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, రంగన్న, సీపీఐ ఆలూరు పట్టణ కార్యదర్శి సిద్ధిలింగ, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యుడు శివప్ప, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జె. రాజు, తాలూకా ఉపాధ్యక్షులు రంగన్న, కాంతారావు, పల్లె శ్రీరాములు, మహేష్, సీపీఐ మండల కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru