Atmakur: బానకచర్ల కాంప్లెక్స్‌ను పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం
Atmakur: నంద్యాల జిల్లా బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్లను పరిశీలించిన కేంద్ర జల వనరుల సంఘం బృందం. శ్రీశైలం ప్రాజెక్టులు, గోదావరి-బానకచర్ల అనుసంధానంపై సమీక్ష.
Atmakur: బానకచర్ల కాంప్లెక్స్‌ను పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం
ఆత్మకూరు: రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీటి పంపిణీకి కీలకమైన బానకచర్ల కాంప్లెక్స్ రెగ్యులేటర్లను కేంద్ర జల వనరుల సంఘం బృందం పరిశీలించింది. శ్రీశైలం జలాశయం ఆధారంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీటి సరఫరా, ప్రాజెక్టుల నీటి కేటాయింపులు, గోదావరి–బానకచర్ల అనుసంధానం తదితర అంశాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలోని బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్లను కేంద్ర జల వనరుల సంఘం బృందం సందర్శించింది. సీడబ్ల్యూసీ ఎక్స్అఫీషియో అదనపు కార్యదర్శి యోగేష్ పైథాకర్, చీఫ్ ఇంజనీర్ ఓ.ఆర్.కె. రెడ్డి, డైరెక్టర్ శంకర్, అడిషనల్ డైరెక్టర్ సీహెచ్ సంజీవ్ తదితరులు బానకచర్ల కాంప్లెక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ వర్షపు సంవత్సరంలో కృష్ణానది ఆధారిత ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి, రాయలసీమ జిల్లాల్లో సాగునీటి అవసరాలు, నీటి లభ్యత వంటి అంశాలపై స్థానిక ముఖ్య ఇంజనీర్లతో సీడబ్ల్యూసీ బృందం సమీక్షించింది. అదే సమయంలో గోదావరి–బానకచర్ల అనుసంధానం, కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు చర్చించారు.
శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ, గాలేరు–నగరి, ఎస్ఆర్బీసీ, కేసీ, కుందూ పథకాలకు కేటాయించిన నీటి వాటాలు, ప్రస్తుతం వినియోగిస్తున్న నీటి పరిమాణం, టీఎంసీల వివరాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకు శ్రీశైలం ఆధారిత ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వసతి కల్పించే ప్రణాళికలు సమర్థవంతంగా ఉన్నాయని సీడబ్ల్యూసీ బృందం అభిప్రాయపడినట్లు అధికారులు తెలిపారు.
అయితే నీటి నిర్వహణలో నదీ యాజమాన్య బోర్డుల నిర్ణయాలు, ప్రభుత్వాల ప్రణాళికల మధ్య సమన్వయ లోపం కారణంగా బచావత్ ట్రిబ్యునల్ నిర్దేశించిన విధానాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
నీటి లభ్యత, కేటాయింపులు, ప్రాజెక్టుల సామర్థ్యం తదితర అంశాలకు సంబంధించిన గణాంకాలు, ప్రణాళికలను పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం బానకచర్ల క్రాస్ కాంప్లెక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. రాయలసీమ సాగునీటి అవసరాలు, భవిష్యత్ నీటి లభ్యత, నదుల అనుసంధాన ప్రతిపాదనలపై కేంద్ర జల వనరుల సంఘం పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది.




