Devanakonda: దేవనకొండ, ఆస్పరిలను కరువు మండలాలుగా ప్రకటించాలి: బొజ్జమ్మ

Devanakonda: దేవనకొండ, ఆస్పరి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, హంద్రీ-నీవా నీటితో చెరువులను నింపాలని కర్నూలు కలెక్టర్ సిరికి కప్పట్రాళ్ల బొజ్జమ్మ విజ్ఞప్తి చేశారు.

Bheemalinga, Aluru
Published on: 3 Oct 2026 8:18 PM IST
Devanakonda
X

Devanakonda: దేవనకొండ, ఆస్పరిలను కరువు మండలాలుగా ప్రకటించాలి: బొజ్జమ్మ

కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి గారిని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ కలిసి దేవనకొండ, ఆస్పరి మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులపై వినతిపత్రం అందజేశారు.

కర్నూలు జిల్లా వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ, ఆస్పరి మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ కరువు మండలాల జాబితాలో ఈ రెండు మండలాలను చేర్చకపోవడం బాధాకరమని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు దెబ్బతింటున్నాయని, చెరువులు నీరు లేక ఎండిపోతున్నాయని వివరించారు. పలు గ్రామాల్లో ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.

అదేవిధంగా హంద్రీ-నీవా కాలువ ద్వారా దేవనకొండ మండలంలోని చెరువులకు నీటిని విడుదల చేసి, గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. నీటి లభ్యత లేక రైతులు, ప్రజలు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

దేవనకొండ, ఆస్పరి మండలాల కరువు పరిస్థితులను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, ఈ రెండు మండలాలను కరువు జాబితాలో చేర్చేలా, చెరువులకు నీరు అందేలా కృషి చేస్తామని కప్పట్రాళ్ల బొజ్జమ్మ తెలిపారు.

అదేవిధంగా ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులు, ప్రజలు, పశుపోషకులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru