Devanakonda: గణేష్ మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి: దేవనకొండ సీఐ
Devanakonda: దేవనకొండ మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి అని సీఐ వేణుగోపాల్ స్పష్టం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేశారు.
Devanakonda: గణేష్ మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి: దేవనకొండ సీఐ
Devanakonda: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవనకొండ మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కుల, మత భేదాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని దేవనకొండ పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్ ప్రజలకు సూచించారు.
మండల పరిధిలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించదలచిన నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని తెలిపారు. అనుమతుల కోసం రుసుము లేని సింగిల్ విండో విధానంలో ganeshutsav.net ద్వారా ఫోన్ నంబర్, OTPతో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితమని స్పష్టం చేశారు.
పోలీసు అధికారులు విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం అందించే QR కోడ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మండపం వద్ద ప్రదర్శించాలని సూచించారు.
మండపాల ఏర్పాటుకు కనీసం ఐదుగురు సభ్యులతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి, వారి వివరాలతో పాటు గుర్తింపు కార్డుల నకళ్లను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమర్పించి అనుమతి పొందాలని తెలిపారు.
ప్రైవేట్ స్థలంలో మండపం ఏర్పాటు చేస్తే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ లేదా పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేస్తే సంబంధిత పంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ఫైర్, విద్యుత్ శాఖల అనుమతులు తీసుకుని, వారి సూచనల మేరకు మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అగ్నిప్రమాదాలు, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌లు జరగకుండా దీపాలు, విద్యుత్ వైర్లు, లైట్ల ఏర్పాటులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. విగ్రహం ఎత్తు, బరువు, ఉత్సవాల నిర్వహణ రోజుల సంఖ్య, నిమజ్జనం తేదీ, సమయం, మార్గం, నిమజ్జనానికి వినియోగించే వాహనం వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.
మండపాలు, విగ్రహాలు రోడ్డుపై ఏర్పాటు చేయరాదని, బ్యానర్లు, ప్లెక్సీలు, పందిళ్ల వల్ల ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లౌడ్‌స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
రాత్రి వేళల్లో మండపాల వద్ద ఉత్సవ కమిటీ ప్రతినిధులు కాపలాగా ఉండాలని, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను మండపాల్లో ఉంచరాదన్నారు. అసభ్య ప్రదర్శనలు, అనుచిత నృత్యాలు జరగకుండా నిర్వాహకులు బాధ్యత వహించాలని, మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులు మండపాల వద్ద లేకుండా చూడాలని సూచించారు.
మహిళలు క్యూలైన్‌ను పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని తెలిపారు.నిమజ్జనం సమయంలో జాగ్రత్తలునిమజ్జనానికి వినియోగించే వాహనం మంచి కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలని, లైసెన్స్ కలిగిన అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే వినియోగించాలని సీఐ సూచించారు. పోలీసుల అనుమతి లేకుండా డీజేలు, అధిక శబ్దం వచ్చే వాయిద్యాలు, మందుగుండు సామగ్రి వినియోగించరాదని స్పష్టం చేశారు.
నిమజ్జన ఊరేగింపులో అసభ్య ప్రదర్శనలు, మద్యం, మత్తు పదార్థాల వినియోగం లేకుండా నిర్వాహకులు బాధ్యత వహించాలని చెప్పారు. నిమజ్జన వాహనంపై మద్యం సేవించిన వ్యక్తులు, మత్తు పదార్థాలు తీసుకున్నవారు, మైనర్లు ఉండరాదని సూచించారు.
ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.నిమజ్జనం సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులను వాహనం నుంచి దింపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తిస్తే ముందుగానే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని దేవనకొండ సీఐ వేణుగోపాల్ కోరారు. నిబంధనలు ఉల్లంఘించినా, అవాంఛనీయ సంఘటనలకు కారణమైనా సంబంధిత ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.




