Devanakonda: దేవనకొండలో అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి!
Devanakonda: దేవనకొండలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్, భద్రతా వివరాలను సీఐ ధనుంజయ వెల్లడించారు.
Devanakonda: దేవనకొండలో అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి!
Devanakonda: ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దేవనకొండలో పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు సీఐ ధనుంజయ తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాలు, డీఎస్పీ వంశీ గౌడ్ పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడిన సీఐ ధనుంజయ ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల వివరాలను వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని తెలిపారు. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నట్లు, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నట్లు వివరించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని సీఐ ధనుంజయ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని కోరారు.




