Allagadda: వన్ మంత్ - ఫోర్ విజిట్’.. 500కు పైగా దరఖాస్తుల స్వీకరణ!

Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ జి. రాజకుమారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 23 May 2026 7:30 PM IST
Allagadda
X

Allagadda: వన్ మంత్ - ఫోర్ విజిట్’.. 500కు పైగా దరఖాస్తుల స్వీకరణ!

Allagadda: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు.*

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, “వన్ మంత్ - ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులపై అధికారులు వేగవంతంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రెండో వారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు.

గత వారం స్వీకరించిన 586 పిటిషన్లను అదే రోజు స్కాన్ చేసి సంబంధిత అధికారులకు పంపించి, వాటిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించామని తెలిపారు. దాదాపు అన్ని పిటిషన్లపై ఫీల్డ్ స్థాయిలో పరిశీలనలు పూర్తయ్యాయని, పెండింగ్‌లో ఉన్న వాటిని ఈ వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వారం కూడా 500కు పైగా వినతులు స్వీకరించామని, వాటిలో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రహదారులు, కల్వర్టులు, బ్రిడ్జిలు, హౌసింగ్ బిల్లులు, సదరం సర్టిఫికెట్లు, రెవెన్యూ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

‘హౌసింగ్ ఫర్ ఆల్’ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ఇటీవల విడుదలైన మెమో ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంట్ స్థలాన్ని లేఅవుట్లలో స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న అర్హులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పట్టాలు అందజేయాలని తహసిల్దార్లకు సూచించారు. కొత్తగా వచ్చే ప్రతి దరఖాస్తును సచివాలయాల ద్వారా స్వీకరించి అర్హతను నిర్ధారించిన తర్వాత మాత్రమే పరిష్కార ప్రక్రియ పూర్తి చేయాలని,

“సచివాలయంలో దరఖాస్తు పెట్టుకోండి” అంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. “సైట్ ఓపెన్ కాలేదు”, “తర్వాత పెడతాం” వంటి కారణాలతో దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుగా మార్క్ అయిన పిటిషన్లను సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంగా రిజెక్ట్ చేసే చర్యలు సహించబోమన్నారు. గతంలో కొన్ని బాధ్యతారాహిత్యపు సమాధానాలు తన దృష్టికి వచ్చాయని, ఇకపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించిన పిటిషన్లను సంబంధిత జిల్లా అధికారుల ద్వారా కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని, అవసరమైన నిధులను ఎన్‌ఆర్‌ఈజీఎస్, డీఎంఎఫ్ లేదా శాఖల నిధుల ద్వారా సమకూర్చే అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలని కలెక్టర్ సూచించారు. నిధులు అందుబాటులో లేని పక్షంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అంశాన్ని కూడా నివేదికల్లో స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.

కేవలం అంచనాలు సిద్ధం చేసి ఫైళ్లను పంపడం వల్ల ప్రయోజనం లేదని, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను సమగ్రంగా తెలియజేయాలని వాటర్ రిసోర్సెస్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతతో, చిత్తశుద్ధితో వ్యవహరించాలని, అసంబద్ధమైన సమాధానాలు అంగీకరించబోమని స్పష్టం చేశారు. కోర్టు వ్యవహారాలు లేదా చట్టపరమైన అంశాలకు సంబంధించిన కేసుల్లోనూ ప్రజలకు సమయానుకూల సమాచారం అందించి నమ్మకం కల్పించాలని సూచించారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, గత వారం నిర్వహించిన స్పందన కార్యక్రమం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నాలుగు వారాలకే పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం ఫైళ్లను ఒక శాఖ నుండి మరో శాఖకు పంపించడం కాకుండా పనులు పూర్తయ్యేలా అధికారులు బాధ్యత వహించాలని సూచించారు.

ప్రతి నియోజకవర్గంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో గృహ నిర్మాణ బిల్లులకు సంబంధించి రూ.49 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారని, ఇలాంటి ఆర్థిక సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో చర్చించి నిధుల విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ సహా అన్ని శాఖల అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ప్రత్యేక పీజీఆర్‌ఎస్ ద్వారా స్వీకరించిన వినతులు

దొర్నిపాడు మండలం రామచంద్రపురం-ఫాంపల్లి గ్రామానికి చెందిన రాళ్లబండి హరికృష్ణ తన సర్వే నంబర్ 476/1/2లోని సుమారు 3.60 సెంట్ల వ్యవసాయ భూమి కేసీ కాలువలో పేరుకుపోయిన పూడిక కారణంగా ప్రభావితమైందని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కాలువ పూడిక తొలగించి నష్టాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన కాల్వ సుబ్బమ్మ కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించి జీవనోపాధికి వితంతు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి అందజేశారు.

ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ నిర్మాణం, క్రీడా మైదానం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story