Atmakur: టిటిడి లడ్డూ కవర్ల వెనుక ఉన్న సృష్టికర్త.. మన ఆత్మకూరు శాస్త్రవేత్తే!
Atmakur: తిరుమల లడ్డూ ప్రసాదానికి పర్యావరణ అనుకూల 'సీడ్ పేపర్ కవర్లు' కనిపెట్టిన ఆత్మకూరు శాస్త్రవేత్త డాక్టర్ వీరబ్రహ్మం.
Atmakur: టిటిడి లడ్డూ కవర్ల వెనుక ఉన్న సృష్టికర్త.. మన ఆత్మకూరు శాస్త్రవేత్తే!
ఆత్మకూరు: కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదానికి భూగోళ వ్యాప్తంగా ఓ ప్రత్యేకత, ఆధ్యాత్మిక విశేషత ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే లడ్డు ప్రసాద సంచులు పర్యావరణ అనుకూలమైనవిగా భావించి భక్తులకు అందిస్తుంది. అయితే లడ్డు ప్రసాదాల సంచుల రూపకల్పన, సృష్టికర్త ఎవరు బయటి ప్రపంచానికి తెలియదు. పైగా ఆ సంచుల కింద ఉన్న తులసి గింజలు మొక్కలుగా ఎదిగేలా విత్తన కాగిత కవర్లను కనిపెట్టింది.
డాక్టర్. వీరబ్రహ్మం అనే శాస్త్రవేత్త. ఈయన నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు సమీప కరివేన గ్రామానికి చెందిన వ్యక్తి. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన వీరబ్రహ్మం డి ఆర్ డి ఓ లో ప్రముఖ శాస్త్రవేత్త. ఆత్మకూరు నల్లమల పరిసరాల్లో జన్మించిన వీరబ్రహ్మం చిన్ననాటి నుంచే సూక్ష్మ పరిశోధనలు చేస్తూ.. డి ఆర్ డి ఓ లో శాస్త్రవేత్త స్థాయికి ఎదిగాడు.
రోజు రోజుకు పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పరిశోధనలు ప్రారంభించాడు. మొదటగా రోజుకు వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమల క్షేత్రంలో స్వామివారి లడ్డు ప్రసాదాలను ప్లాస్టిక్ కవర్లలో అందించడాన్ని గమనించాడు. తన బృందంలోని సహాయకులతో కలిసి పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ మంత్ర కవర్లను సృష్టించాడు.
సీడ్ సీడ్ పేపర్ కవర్ల అడుగు భాగంలో తులసి విత్తనాలు కాగితపు గుజ్జుతో కలిసి ఉంటాయి. సంచులను వాడిన తర్వాత ముక్కలుగా చించి మట్టిలో వేస్తే తేమకు తులసి గింజలు మొలకెత్తుతాయి. భక్తులకు ఈ సీడ్ పేపర్ తో.. ఆధ్యాత్మిక అనుబంధం పెరుగుతుంది అని శాస్త్రవేత్త వీరబ్రహ్మం అంటున్నారు. ఈ కంపోస్టబుల్ బయోడిగ్రేడబుల్ సీడెన్ బెడ్ సంచులు 150 రోజుల్లో నేల మట్టిలో కలిసిపోయి ఇరువుగా మారుతుంది.
స్వామివారి ప్రసాదంతో పాటు వచ్చే ఈ సంచులను పార వేయకుండా ఇంట్లోనే తులసి మొక్కగా మార్చుకోవడం ఒక అద్భుతమైన అనుభూతిగా భక్తులకు మిగిలి పోవడమే కాక తిరుమలలో ప్లాస్టిక్ ను దశలవారీగా నిర్మూలించేందుకు తన వంతు పరిశోధనలు చేశానని చెబుతున్నారు యువ శాస్త్రవేత్త డాక్టర్ వీరబ్రహ్మం. ఒక్కో సంచి అడుగుభాగం లో సుమారు 200 తులసి మొక్క విత్తనాలు దాగి ఉంటాయి.
తిరుమల తిరుపతి తరహా లోనే అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం, భూ మండలానికి నాభి స్థానం శ్రీశైల క్షేత్రంలో కూడా ప్లాస్టిక్ రహిత దేవస్థానంగా తీర్చిదిద్దాలని భక్తులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ప్రాచీన కాలంలో శ్రీశైల క్షేత్రంలో మొట్టమొదటిసారిగా కరివేన బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసింది ఆత్మకూరు కరివేన అగ్రహారం ప్రజలే.
తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవుల్లో శ్రీశైల క్షేత్రం చుట్టూ హిమాలయాలలోని జీవ వైవిధ్యం నెలకొంది. వేల సంఖ్యలో ఆయుర్వేద ఔషధ వృక్షాలు నిగూఢంగా ఉన్నాయి. వాటి గింజలు, మూలికలు, పత్రాలు, మృత్తికపై డి ఆర్ డి ఓ లో శాస్త్రవేత్తగా ఉన్న వీర బ్రహ్మంతో నల్లమల లో పరిశోధనలు చేయించాలని ఔత్సాహిక పరిశోధకులతోపాటు శ్రీశైల మల్లన్న భక్తులు శ్రీశైల దేవస్థానం అధికారులను కోరుతున్నారు.
తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు దేవస్థానాన్ని దోచుకోవడం తగ్గించి .. రోజురోజుకు భక్తుల సంఖ్యను మించి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే విషయంపై కాస్తంతైన దృష్టి పెట్టండని మల్లన్న భక్తులు పాలకులకు సూచిస్తున్నారు.
ఆత్మకూరు ప్రాంతానికి చెందిన డి ఆర్ డి ఓ యువ శాస్త్రవేత్త డాక్టర్ వీరబ్రహ్మం అతి ప్రాచీన వేల సంవత్సరాల నాటి నల్లమల అడవులు, పర్యావరణం పై పరిశోధనలు చేసేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.




