Nandyal: అహోబిలం ఎమ్మెల్యే అఖిలప్రియపై గంగుల నాని ఆరోపణలు

Nandyal: అహోబిలం దేవస్థానం టెండర్లలో అవకతవకలు జరిగాయని గంగుల నాని ఆరోపణ. తలనీలాలు, టోల్‌గేట్ కాంట్రాక్టులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్.

R Pavankalyan, Nandyal
Published on: 9 July 2026 3:12 PM IST
Nandyal
X

Nandyal: అహోబిలం ఎమ్మెల్యే అఖిలప్రియపై గంగుల నాని ఆరోపణలు

నంద్యాల: నంద్యాల జిల్లా అహోబిలం దేవస్థానం వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. తలనీలాల టెండర్, టోల్‌గేట్ కాంట్రాక్టులు, దేవస్థానం ఆదాయం, కమిషన్ల ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గంగుల నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆరోపణలకు పూర్తి ఆధారాలు ఉన్నాయని చెబుతూ, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అహోబిలం దేవస్థానం తలనీలాల టెండర్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గంగుల నాని కీలక ఆరోపణలు చేశారు. తాను చేస్తున్న ప్రతి ఆరోపణకు వంద శాతం ఆధారాలు ఉన్నాయని, ఇప్పటికే వాటిని మీడియా ముందుంచామని తెలిపారు.

తలనీలాల టెండర్ ప్రక్రియలో కోటి 50 లక్షల కంటే ఎక్కువ ధరకు ఎవరైనా వస్తే టెండర్ ఇస్తామని ప్రకటించినప్పటికీ, అనంతరం కోటి 70 లక్షల రూపాయలకు ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం తలనీలాలను తరలిస్తుండగా, సంబంధిత సంస్థకు అన్ని చట్టబద్ధ పత్రాలు, వే-బిల్లు ఉన్నప్పటికీ వాటిని అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు.

తలనీలాల రవాణాను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, ఇది పూర్తిగా కమిషన్ల కోసమే జరుగుతోందని గంగుల నాని ఆరోపించారు. గతంలో కూడా టెండర్ ప్రక్రియను ప్రభావితం చేసి తక్కువ ధరకు తలనీలాలను తీసుకెళ్లారని, అంతర్జాతీయ మార్కెట్లో అధిక విలువ ఉన్న హెయిర్‌ను తక్కువ ధరలకు అప్పగించడం వల్ల దేవస్థానానికి భారీ నష్టం జరిగిందని విమర్శించారు.

టోల్‌గేట్ కాంట్రాక్టుపైనా గంగుల నాని ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో 50 లక్షల రూపాయల కాంట్రాక్టు ఉన్నప్పుడు వసూలు చేసిన టోల్ రుసుములు, ఇప్పుడు కాంట్రాక్టు విలువ 25 లక్షలకు తగ్గినా ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. దేవస్థానం ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరిస్తున్న వారిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

తన వద్ద ఉన్న పత్రాలు, టెండర్ వివరాలు, వే-బిల్లులు, ఆడియో రికార్డింగ్‌లు అన్నీ విచారణకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని గంగుల నాని తెలిపారు. టెండర్‌లో పాల్గొన్న వారిని బెదిరించినట్లు ఆడియో రికార్డింగ్‌లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆ కాల్ డేటా, రికార్డింగ్‌లపై దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు.

మఠానికి సంబంధించిన అంశాలపై తనకు సంబంధం లేదని, దేవస్థానం ఆదాయానికి నష్టం కలిగించే అంశాలపైనే తాను ప్రశ్నిస్తున్నానని గంగుల నాని స్పష్టం చేశారు. తలనీలాల టెండర్లు, టోల్‌గేట్ కాంట్రాక్టులు, దేవస్థానం ఆదాయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

అహోబిలం దేవస్థానం వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గంగుల నాని చేసిన ఈ ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై అధికార పక్షం లేదా సంబంధిత వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story