Gudur: గూడూరులో డంప్ యార్డు తరలించకుంటే ముట్టడి: సీపీఎం
Gudur: గూడూరు మునగాల రోడ్డులోని డంప్ యార్డును దూర ప్రాంతానికి తరలించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి మోహన్ హెచ్చరించారు.
Gudur: గూడూరులో డంప్ యార్డు తరలించకుంటే ముట్టడి: సీపీఎం
కర్నూలు జిల్లా: గూడూరు పట్టణంలోని మునగాల రోడ్డులో ఉన్న డంప్ యార్డును దూర ప్రాంతానికి తరలించి పడమర బీసీ కాలనీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, లేకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి మోహన్ హెచ్చరించారు.
డంప్ యార్డు కారణంగా పడమర బీసీ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గూడూరు సీపీఎం ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు డంప్ యార్డు సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ, మునగాల రోడ్డులోని డంప్ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసనతో కాలనీ ప్రజలతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
డంప్ యార్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి దుర్గంధం కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కొంతమందికి డెంగ్యూ జ్వరాలు కూడా వచ్చాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుర్వాసన కారణంగా ఇళ్లలో ఉండటానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
డంప్ యార్డును తరలించాలని సీపీఎం తరఫున అనేకసార్లు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి డంప్ యార్డును దూర ప్రాంతానికి తరలించాలని, లేకపోతే పడమర బీసీ కాలనీ ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కాలనీ పెద్దలు వీర కృష్ణగౌడ్, గోవిందరెడ్డి, గొల్ల మధు మాట్లాడుతూ, డంప్ యార్డు కారణంగా కాలనీలోని అనేకమంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. సమస్యను గత పాలకులు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు.
ఈ కార్యక్రమంలో గూడూరు సీపీఎం నాయకులు దానమన్న, కృప, నాగేష్, సురేష్, కాలనీ ప్రజలు మాధవి, గొల్ల సవరమ్మ, కృష్ణవేణి, కురువ సురేష్, చాకలి లక్ష్మీదేవి, డీలర్ ప్రభాకర్, హమాలీ సంఘం నాయకులు కొమ్మురాజు, చిన్నరాజు, పూల రవి, అబ్రహం, ఏసేపు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.




