Nandikotkur: కృష్ణానదిలో అక్రమ మట్టి తవ్వకాలు.. నందికొట్కూరులో ఆందోళన
Nandikotkur: నందికొట్కూరులో కృష్ణా నదిలో అక్రమ మట్టి తవ్వకాలు పెరుగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Nandikotkur
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు పరిధిలో కృష్ణా నదిలో నీటిమట్టం తగ్గడంతో నదీగర్భంలో అక్రమ మట్టి తవ్వకాలు పెరుగుతున్నాయి. మండలంలోని శాతనకోట గ్రామ సమీపంలో నీటి మునక భూములను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు సారవంతమైన మట్టిని తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం.
ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు నదిలోకి దిగి మట్టిని తరలిస్తున్నాయి. ఒక్క ట్రాక్టర్ మట్టిని రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇటుక బట్టీలు, గృహ నిర్మాణాలకు ఈ మట్టిని సరఫరా చేస్తూ రోజుకు లక్షల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
పోక్లైన్లతో విచక్షణారహితంగా తవ్వకాలు జరపడం వల్ల నదీ ప్రవాహ మార్గం దెబ్బతింటుందని, భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సారవంతమైన మట్టి పొర తొలగిపోవడం వల్ల భవిష్యత్తులో వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తవ్వకాలు పగటిపూటే బహిరంగంగా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.




