Atmakur: ఆత్మకూరు పెద్దపులుల అభయా రణ్యంలో సంచరిస్తున్న అడవి దున్న
Atmakur: నల్లమల అడవుల్లో 158 ఏళ్ల క్రితం కనుమరుగైన అడవి దున్నలు (గౌర్) మళ్లీ అడుగుపెట్టబోతున్నాయి.
Atmakur: ఆత్మకూరు పెద్దపులుల అభయా రణ్యంలో సంచరిస్తున్న అడవి దున్న
ఆత్మకూరు: ఒకనాటి నల్లమల అడవులు 10 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేవి. బ్రిటిషర్ల పాలనలో మద్రాసు ప్రెసిడెన్షియల్ ప్రభుత్వంలో తూర్పు కనుమల్లో భాగమైన నల్లమలలో అడవి దున్నలు ( గౌర్ ) వేల సంఖ్యలో సంచరించేవని మార్కాపురం అటవీ కార్యాలయంలో ఉన్న బ్రిటిష్ గెజిట్లోలో స్పష్టంగా రాశారు. 158 సంవత్సరాల క్రితం నల్లమలలో జీవనం సాగించిన అడవి దున్నల సమూహాలు ఓ సూక్ష్మ క్రిమి వ్యాప్తి వల్ల మృత్యువాత పడగా, మిగిలిన దున్నలు నల్లమల నుంచి బయటకు వలసలువెల్లాయి. అలా వెళ్లదంతో పూర్తిగా కనుమరుగైన అడవి దున్నలు 158 సంవత్సరాల తర్వాత నల్లమలలో అది కూడా నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్లో దర్శనమివ్వబోతున్నాయి.
అయితే ఓ అడవి దున్న ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆత్మకూరు డివిజన్ భైర్లుటి, నాగలూటి అటవీ రేంజ్ లలో చెంచు గిరిజనుల కంటపడింది. అటవీశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ అడవితున్న సంచారంపై పరిశోధించగా కర్ణాటక నుంచి తెలంగాణ అమ్రాబాద్ పెద్ద పులుల అభయారణ్యం మీదుగా ఏపీలోని నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం ఆత్మకూరు డివిజన్ పెచ్చెరువు, భైర్లుటి అడవుల్లో సంచరిస్తూ గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం వైపు వెళ్ళింది. ఈ అడవి దున్న ఆకస్మికంగా ప్రత్యక్షంగా కనబడడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడో 158 ఏళ్ల క్రితం శాశ్వతంగా అంతరించిపోయిన అడవి దున్న తిరిగి తనంతకుతాను ప్రత్యక్షమవడం అటవీశాఖ అధికారుల్లో ఆలోచనలు రేకెత్తించాయి. తిరిగి నల్లమలలో అడవి దున్నలను పునః ప్రవేశపెట్టే కొత్త ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో డిబ్రూగర్ ఇండియన్ బై సన్ ఫెస్ట్ సమావేశంలో మధ్యప్రదేశ్ సత్పురా టైగర్ రిజర్వు నుంచి 120 అడవి దున్నలను మూడు విడతల్లో నల్లమలలో ప్రవేశపెట్టేందుకు ఏపీ అటవీశాఖ సిద్ధపడింది. ఆత్మకూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతాల్లో 100 ఎకరాల్లో ఎన్ క్లోజర్లు ఏర్పాటుచేసి 30 రోజులపాటు దున్నలను వాటిలో ఉంచి శాస్త్రీయ పరిశీలన తర్వాత నల్లమల అడవుల్లో విడిచి పెడతారు. మూడు విడతల్లో నల్లమలకు వచ్చే క్రమంలో మొదటి విడతలో 40 దున్నలను రప్పించి పర్యవేక్షిస్తారు. శాటిలైట్ కాలర్ ఐడి ఏర్పాటుచేసి అవి ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాయో పరిశీలిస్తారు.
అంతరించిపోతున్న అరుదైన ఐ యు సి ఎన్ రెడ్ లిస్ట్ డేటాలో షెడ్యూల్ 1 జాబితాలో ఉన్న ఈ అడవి దున్న జాతి నల్లమలలో తిరిగి ప్రవేశపెట్టడం చారిత్రక పునరాగామనం అని వన్య ప్రాణి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్ ఎస్ టి ఆర్ లో మానవ జోక్యం లేని ప్రాంతాల్లోని సారవంతమైన గడ్డి మైదానాలలో ఈ అడవి దున్నలు సంచరించబోతున్నాయి. చారిత్రక కథనాలలోకి వెళితే 11వ శతాబ్దానికి ముందే నిర్మించిన శ్రీశైల ఆలయ రాతి ప్రాకారం గోడలపై అడవి దున్నలను బల్లెంతో వేటాడే శిల్పాలను చెక్కారు. బ్రిటిష్ సైనిక అధికారులు యుద్ధ సమయంలో అడవి దున్న చర్మాలతో చేసిన కవచాలను ధరించేవారు. లక్షల అడవి దున్న ల చర్మాలను ఇంగ్లాండ్ కు చేరవేశారు. నల్లమల గిరిజనులు శ్రీశైలంలో భ్రమరాంబ దేవికి అడవి దున్నలను బలిచ్చేవారు. వీటి అవయవాలను, కొవ్వు పదార్థాలను, ఎముకలలోని మజ్జతో ఆదివాసీలు ఔషధాలు తయారు చేసేవారు.
నల్లమల అడవుల పర్యావరణ పరిరక్షణకు అడవి దున్నల ఉపయోగం ఎంతో ఉండడమే కాక, భారతదేశంలోనే అతిపెద్ద పెద్దపుల సహజ అభయారణ్యం నాగార్జునసాగర్ - శ్రీశైలం అభయారణ్యంలో అడవి దున్నలను పునః ప్రవేశపెట్టడం దక్షిణ భారతదేశంలో ఓ అరుదైన చరిత్రను సృష్టించడమే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి మొదటి విడతలో అడవి దున్నలను ఆత్మకూరు అటవీ డివిజన్లో వదిలే ప్రణాళికను అమలు చేసేందుకు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.




