Kurnool: 40 ఏళ్ల తర్వాత ఏకగ్రీవమైన బూడిదపాడు గ్రామపంచాయతీ

Kurnool: కర్నూలు జిల్లా గూడూరు మండలం బూడిదపాడు గ్రామపంచాయతీ 40 ఏళ్ల తర్వాత ఏకగ్రీవం; సర్పంచ్, అన్ని వార్డులు ఏకగ్రీవంతో గ్రామాభివృద్ధికి ముందడుగు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 Nov 2026 11:46 PM IST
Kurnool
X

Kurnool: 40 ఏళ్ల తర్వాత ఏకగ్రీవమైన బూడిదపాడు గ్రామపంచాయతీ

కర్నూలు: కర్నూలు జిల్లా లోని ఆ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ఐక్యత చాటుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత కర్నూలు జిల్లా గూడూరు మండలం బూడిదపాడు గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్ స్థానంతో పాటు గ్రామపంచాయతీలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవం కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బూడిదపాడు గ్రామపంచాయతీ ప్రోత్సాహకానికి అర్హత సాధించింది.

గ్రామంలో అందరూ కలిసి ఒకే నిర్ణయానికి రావడం, ఎన్నికల బరిలో పోటీ లేకుండా ఏకగ్రీవానికి సహకరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించడంతో ఈ ఏకగ్రీవం సాధ్యమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు అధికారులు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ తరఫున మాట్లాడిన శ్రీనివాసులు గ్రామ ప్రజలకు, ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

గూడూరు మండల టీడీపీ కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ.. బూడిదపాడు గ్రామపంచాయతీ ఏకగ్రీవానికి సహకరించిన ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

40 ఏళ్ల తర్వాత గ్రామపంచాయతీ ఏకగ్రీవం కావడం బూడిదపాడు గ్రామ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఎన్నికల పోటీకి దూరంగా ఉండి గ్రామ ఐక్యతకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రజల నిర్ణయం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL