Kurnool: ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ!

Kurnool: కర్నూలు జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సి.బెళగల్, పోలకల్ గ్రామాల్లో ఎస్ఐ వేణుగోపాల రాజు ఆధ్వర్యంలో పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు.

C. Ganesh, Kodumuru
Published on: 12 Nov 2026 9:26 PM IST
Kurnool
X

Kurnool: ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ!

కర్నూలు: కర్నూలు జిల్లా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సి.బెళగల్, పోలకల్ గ్రామాల్లో ఎస్‌ఐ వేణుగోపాల రాజు పోలీసు సిబ్బందితో కలిసి రూట్ మార్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ రూట్ మార్చ్‌లో గ్రామాల్లోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన కూడళ్లు, సున్నితమైన ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసుల భద్రతా చర్యలపై భరోసా కల్పించారు.

అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమైన ఎస్‌ఐ వేణుగోపాల రాజు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పరస్పరం సంయమనం పాటించాలని, ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవాల పేరుతో ప్రత్యర్థులపై దాడులు చేయడం, గొడవలకు దిగడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.

అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు, విద్వేషపూరిత సందేశాలను ప్రచారం చేయరాదని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే సైబర్ మోసాలను నమ్మరాదన్నారు. ఎవరితోనూ ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, గ్రామాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు, గొడవలు లేదా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ రూట్ మార్చ్ ద్వారా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, భద్రతా భావం పెంపొందించేలా అవగాహన కల్పించారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru