Kurnool: రోడ్లపై గుంతలు తవ్విన వారిపై పోలీసు కేసు నమోదు
Kurnool: కర్నూలులో రోడ్లపై గుంతలు తవ్విన వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. రోడ్లను పాడు చేయవద్దని హెచ్చరించారు.
Kurnool: రోడ్లపై గుంతలు తవ్విన వారిపై పోలీసు కేసు నమోదు
కర్నూలు: నగరంలో ప్రజాధనంతో నిర్మించిన రహదారులపై గుంతలు తవ్వడం, మేకులు కొట్టడం వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం, 1994లోని సెక్షన్ 197 ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరిస్తున్న విషయం విదితమే.
అయితే, నగరంలోని గణేష్ నగర్-2లో షామియానాల కోసం రహదారులపై గుంతలు తవ్విన విషయం గురువారం కమిషనర్ దృష్టికి రావడంతో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఇంజినీరింగ్ విభాగ అధికారులను ఆదేశించారు.
కమిషనర్ మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో వివాహాలు, నిశ్చితార్థాలు గృహప్రవేశాలు, పూజా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు షామియానాలు, పందిళ్లు ఏర్పాటు చేసేటప్పుడు రహదారులపై గుంతలు తవ్వడం, మేకులు కొట్టడం వంటి పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ చేయొద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఒకసారి రహదారిని తవ్వడం వల్ల ఏర్పడే ప్యాచ్‌ల కారణంగా రోడ్డు నాణ్యత దెబ్బతింటుందని, మున్ముందు అదే ప్రాంతంలో గుంత మరింత పెద్దదిగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా పదేపదే ప్యాచ్‌లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
లక్షలాది రూపాయలతో నిర్మించిన రహదారులకు నష్టం కలగకుండా షామియానాల కోసం కాంక్రీట్ స్టాండ్లనే ఉపయోగించాలని ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో పాటు కార్యక్రమ నిర్వాహకులు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.




