Kurnool: కర్నూలు సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు.. కలెక్టర్ సిరి
Kurnool: కర్నూలు జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన రంగాల లక్ష్యాల సాధనపై కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సమీక్ష.
Kurnool: కర్నూలు సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు.. కలెక్టర్ సిరి
Kurnool: వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికమించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ శాఖ అధికారులతో సంబధిత అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఏపీ ఎఫ్‌ఆర్‌లో రైతుల నమోదును మరింత పెంచాలని సూచించారు. రైతులు పూర్తి స్థాయిలో నమోదు చేసుకుంటే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా మరియు సులభంగా అందుతాయని తెలిపారు.
అలాగే ఏపీఎంఎస్ రైతు ఐడీల నమోదు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రైతులు ఏపీఎంఎస్ ఐడి క్రియేట్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ నుంచి అందించే వివిధ పథకాలు, సబ్సిడీలు, సేవలు సులభంగా పొందగలరని తెలిపారు. జిల్లాలో ఇంకా పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ త్వరితగతిన ఐడీలు నమోదు చేసుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏపీఎంఐపీ పథకము అమలు పై సమీక్ష నిర్వహిస్తూ… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 6,400 హెక్టార్ల లక్ష్యం ఉన్నప్పటికీ, దానిని అధిగమించి కనీసం 10 వేల హెక్టార్ల వరకు డ్రిప్ ఇరిగేషన్ విస్తరించేలా కృషి చేయాలని సూచించారు. సూక్ష్మ సాగునీటి విధానాల ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు రైతులకు దిగుబడులు కూడా మెరుగుపడతాయని తెలిపారు.
జిల్లాలో ఉద్యాన సాగును మరింత ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా రెండు లేదా మూడు రకాల పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా పండ్ల తోటల సాగును పెంచేందుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎం ఐ డి హెచ్ పథకం కింద కలెక్షన్ సెంటర్లు,
కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, రిటైల్ మార్కెట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని తెలిపారు. రైతులు పండించిన ఉత్పత్తులకు నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడితే వారికి మంచి ధరలు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాల అభివృద్ధికి అధికారులు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఈ సమావేశానికి జెడి అగ్రికల్చర్ వరలక్ష్మి, ఏడి హార్టికల్చర్ రాజా కృష్ణారెడ్డి , ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్, సిపిఓ భారతి పాల్గొన్నారు.




