Kurnool: తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు.. కలెక్టర్ డా. ఏ. సిరి

Kurnool: కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 21 April 2026 4:53 PM IST
Kurnool
X

Kurnool: తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు.. కలెక్టర్ డా. ఏ. సిరి

Kurnool: జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామంలోని పందికోన రిజర్వాయర్ నుండి త్రాగు నీటిని ఫిల్టర్ చేసే మైక్రో ఫిల్టర్ పంప్ హౌస్, గ్యాస్ క్లోరినేషన్ కేంద్రాలలో త్రాగునీటి శుద్ధి ప్రక్రియను, వాటర్ శాంపిల్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా త్రాగు నీటిని ఫిల్టర్ చేసే మైక్రో ఫిల్టర్ పంప్ హౌస్, గ్యాస్ క్లోరినేషన్ కేంద్రాలను పరిశీలిస్తూ వాటి నిర్వహణ ఏ విధంగా ఉంది, ఏమైనా మరమ్మతులు ఉన్నాయా అని పరిశీలించారు. రోజుకు ఎంత మేరకు నీటిని ఫిల్టర్ చేస్తారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

క్లోరినేషన్ పరీక్ష ఏ విధంగా చేస్తున్నారని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇసుక ఫిల్టర్లు (Sand filters) ఉపయోగించి, కార్బన్ సహాయంతో మలినాలను తొలగించి, సెడిమెంటేషన్ ప్రక్రియ తర్వాత క్లోరినేషన్ చేసి గ్రామాలకు మరియు ట్యాంకులకు నీటిని సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీటిని అందించేలా వ్యవస్థను మెరుగుపరచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా ముందుగానే అప్రమత్తమై, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

పత్తికొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న OHSR ట్యాంక్ ను కలెక్టర్ పరిశీలిస్తూ ట్యాంక్ నిర్వహణ విధానాలను, నీటి నాణ్యతను తనిఖీ చేశారు. నీటిలో క్లోరిన్ స్థాయిలను పరీక్షిస్తున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తూ, శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి నమూనాలను పరీక్షించాలని (వాటర్ శాంపిల్ టెస్టింగ్) మరియు క్రమం తప్పకుండా ట్యాంకులను శుభ్రం చేయించాలని కలెక్టర్ RWS అధికారులను ఆదేశించారు ట్యాంక్ ను క్లోరినేషన్ చేసిన తేదీ, శుభ్రపరచిన తేదీ వివరాలను ఖచ్చితంగా రాయాలన్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం 33 CPWS (సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా) పథకాలు, 800 PWS (రక్షిత మంచినీటి సరఫరా) పథకాలు మరియు 1200 మినీ PWS పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటితో పాటు దాదాపు 300 బోర్ వెల్స్ మరియు 1000 హ్యాండ్ పంప్స్ (చేతి పంపులు) ఉన్నాయన్నారు. SDS పథకం కింద 53 పనులకు మంజూరు లభించిందని,

వీటిని త్వరలోనే ప్రారంభించనున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మందికి ఉపయోగపడే పనులను గుర్తించడం జరిగిందని, ఇందుకోసం కుడా నిధుల నుండి దాదాపు రూ. 3.5 కోట్ల నుండి 4 కోట్ల రూపాయలను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు..

BC వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ మరియు అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో త్రాగునీరు మరియు టాయిలెట్ సమస్యల పరిష్కారం కోసం 2.3 కోట్ల రూపాయలు మంజూరు చేసి, సంబంధిత పనులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు.అనంతరం పందికోన రిజర్వాయర్ ను పరిశీలించారు.. నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం నీటి స్థాయి గురించి కలెక్టర్ అధికారులతో ఆరా తీశారు.

కార్యక్రమంలో పత్తికొండ ఇంచార్జి ఆర్డీఓ మధుసూదన్ రెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story