Devanakonda: ఈదుల దేవరబండలో పీఎండీఎస్ సాగును పరిశీలించిన కలెక్టర్!
Devanakonda: పీఎండీఎస్ విధానంలో 18 రకాల పంటలను సాగు చేస్తున్న రైతు రాముడు పొలాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పరిశీలించారు.
Devanakonda: ఈదుల దేవరబండలో పీఎండీఎస్ సాగును పరిశీలించిన కలెక్టర్!
దేవనకొండ: దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామపంచాయతీ ఈదుల దేవరబండ గ్రామంలో రైతు రాముడు తన 3 ఎకరాల్లో పొలంలో పీఎండీఎస్ (PMDS - Pre-Monsoon Dry Sowing) విధానం ద్వారా చేపట్టిన పంటల సాగును మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మరియు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు రాముడు మూడు ఎకరాల భూమిలో రెండు ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి, బోరు నీరు తక్కువగా ఉన్నప్పటికీ సమర్థవంతంగా వినియోగిస్తూ బెండ ,ఆముదం, చిక్కుడు, బీట్‌రూట్,బీరకాయలు,వంకాయి,టమాటా ,క్యారెట్, ముల్లంగి,మొక్కజొన్న , తోటకూర, పెసలు, మినుములు, కొత్తిమీర,పాలకూర , గోంగూర తదితర 18 రకాల పంటలను సాగు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ పంటలు నాటి నెలరోజులు పూర్తికాగా, గత 15 రోజులుగా ఆకుకూరల విక్రయం ద్వారా రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఆదాయం పొందుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
త్వరలో టమాటా, వంకాయ, బీరకాయ, అలసంద వంటి పంటలు కూడా దిగుబడికి సిద్ధమవుతున్నాయని, దీంతో మరో రెండు నుంచి మూడు నెలల పాటు రైతుకు రోజువారీ ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు.ఈ విధానం రైతుల కుటుంబ అవసరాలను తీర్చడమే కాకుండా అప్పుల భారం తగ్గించడంలోనూ తోడ్పడుతుందన్నారు. జిల్లాలో రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానాన్ని విస్తృతంగా అమలు చేసి, బహుళ పంటల సాగు ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
పీఎండీఎస్ విధానంలో బహుళ పంటల సాగు చేపట్టడం వల్ల తక్కువ నీటితోనే అధిక ప్రయోజనం పొందవచ్చని, వర్షపు నీరు భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేల సారవంతం మెరుగుపడుతుందని కలెక్టర్ వివరించారు. వివిధ పంటల వేర్ల వ్యవస్థల కారణంగా నేలలో సూక్ష్మజీవుల పెరుగుదల కూడా అధికమవుతుందన్నారు.
అదే విధంగా పీఎండీఎస్ విధానంలో సాగు చేసిన మొక్కజొన్న పంటలో సాధారణంగా ఒకే కంకి వచ్చే చోట నాలుగు కంకులు రావడం వంటి మెరుగైన ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేసాయాన్నారు. రైతులందరూ ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించి 18 నుంచి 20 రకాల విత్తనాలతో బహుళ పంటల సాగు చేపట్టి, స్థిరమైన ఆదాయంతో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు
అనంతరం హాఫ్ మూన్ మోడల్ లో పీఎండీఎస్ (PMDS - Pre-Monsoon Dry Sowing) విధానం ద్వారా ఆముదం, అలసందలు, తదితర విత్తనాలను రాముడు పొలంలో కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ విత్తనాలు నాటారు..కార్యక్రమంలో నాచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి , డి ఎల్ ఎఫ్ పి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.




