Kurnool: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి!
Kurnool: కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. బ్యాలెట్ ముద్రణ, భద్రతపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష.
Kurnool: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి!
కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి, భద్రత, రవాణా, వెబ్‌కాస్టింగ్, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముందుగానే అంచనా వేయాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, నాణ్యత తనిఖీ, అభ్యర్థుల వివరాల పరిశీలన, పంపిణీ, భద్రపరిచే ప్రక్రియలో ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సుల తనిఖీతో పాటు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో బూత్ నంబర్లు, వార్డు నంబర్లు, ఎంఎస్‌పీ, ఎల్‌ఎస్‌పీ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని, ఎన్నికల సామగ్రిని ముందుగానే సిద్ధం చేసి సకాలంలో పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది కేటాయింపునకు సంబంధించి ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ ద్వారా మూడు విడతల్లో ర్యాండమైజేషన్ నిర్వహించాలని, అవసరమైన సిబ్బందికి అదనంగా 20 శాతం రిజర్వ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. సిబ్బందికి ఎన్నికల విధులు, బాధ్యతలు, పోలింగ్ నిర్వహణ విధానాలపై సమగ్ర శిక్షణ అందించాలని తెలిపారు.
పోలింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వినియోగం, వెబ్‌కాస్టింగ్, వాహనాల సమీకరణ, రవాణా సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు, వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని, మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వార్డుల వారీగా ఓటర్ల వివరాలను కచ్చితంగా నిర్ధారించి, అవసరమైన సిబ్బందిని కేటాయించాలని, పోస్టల్ బ్యాలెట్ల ర్యాండమైజేషన్‌తో పాటు వాటి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియలను ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలి
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, వీడియో సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. లైసెన్స్‌డ్ ఆయుధాలు కలిగిన వారి వివరాలను సమీక్షించాలని, ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం నిల్వలు, రోజువారీ విక్రయాలు, ఉత్పత్తి వివరాలను పర్యవేక్షిస్తూ నివేదికలు సమర్పించాలని తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాలను అధికారులు ముందుగానే సందర్శించి తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, విద్యుత్, ఫర్నిచర్ వంటి మౌలిక వసతులను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని పరిశీలించి, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన రవాణా, భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, ఎన్నికల వ్యయ నియంత్రణ, మీడియా మేనేజ్మెంట్ తదితర అంశాలపై ఆయా నోడల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, అవసరమైన నివేదికలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని సూచించారు.
ఎన్నికల ఏర్పాట్లకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రతి దశకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా బ్యాలెట్ పేపర్ల సంఖ్య, ముద్రణ, నాణ్యత, పంపిణీ, భద్రతకు సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
నామినేషన్ల ఉపసంహరణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన గడువులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది, సామగ్రిని సమకూర్చుకోవాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని, ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.




