Kurnool: కర్నూలు గ్యాస్ ఏజెన్సీలకు కలెక్టర్ వార్నింగ్
Kurnool: గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు. మాధురి గ్యాస్ ఏజెన్సీపై వేటు. ఏజెన్సీల పనితీరుపై కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి ఆగ్రహం.
Kurnool: కర్నూలు గ్యాస్ ఏజెన్సీలకు కలెక్టర్ వార్నింగ్
కర్నూలు: గ్యాస్ ఏజెన్సీలు ప్రజల సానుకూల దృక్పథం ( పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ) లో మంచి గుర్తింపు సాధించి జిల్లా ను మంచి స్థానం లో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి అని పౌరసరఫరాల శాఖ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి.పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 పథకం ద్వారా ప్రజల కు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తూ ఉన్నప్పటికీ ప్రజల నుండి సానుకూల దృక్పథం ( పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ) రాకపోవటానికి కారణం గ్యాస్ ఏజెన్సీలు మరియు డెలివరీ బాయ్స్ కారణమని తెలిపారు.
ఇప్పటికే చాలాసార్లు ఈ విషయంపై సూచనలు ఇవ్వడం , శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. డెలివరీ బాయ్స్ అదనపు సొమ్ము వసూలుకు పాల్పడం వలన ప్రజల సానుకూల దృక్పథం సూచిక లో వెనుకబడి ఉన్నామని ఈ విషయంలో ఏజెన్సీలు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఐఓసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ) సంస్థ ఇప్పటికే మూడు ఏజెన్సీ లపై చర్యలు తీసుకున్నదని తెలిపారు. కొన్ని ఏజెన్సీలపై 2 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయల వరకు పెనాల్టీలు కూడా విధించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.పెద్ద కడుబూరు చెందిన మాధురి గ్యాస్ ఏజెన్సీ కి ఎన్నిసార్లు హెచ్చరించిన సరైన చర్యలు తీసుకొననందున ఆ ఏజెన్సీ పై చర్యల లో భాగంగా వారి కస్టమర్లను సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి ట్యాగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున గ్యాస్ ఏజెన్సీలు చిత్తశుద్ధితో ప్రజలకు గ్యాస్ సరఫరా చేసి ప్రజా సానుకూలత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ... గ్యాస్ డెలివరీ బాయ్స్ లు ప్రజల కు సిలిండర్ ఇచ్చాక అదనపు మొత్తం తీసుకొనరాదు.ఏజెన్సీ లు డెలివరీ బాయ్స్ కు జీతం బ్యాంక్ లేదా డిజిటల్ పేమెంట్స్ ద్వారా మాత్రమే చెల్లించాలి,ఈ విధంగా చేయక పొతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్బంగా గ్యాస్ ఏజెన్సీ లు శివ బాలాజీ సి- బెలగల్ , మాధురి గ్యాస్ ఏజెన్సీ పెద్దకడబూరు , విజయ గ్యాస్ కర్నూల్ , సూర్య గ్యాస్ ఏజెన్సీ , విష్ణుప్రియ మొదలగు గ్యాస్ ఏజెన్సీలను సమీక్షిస్తూ ఎంతమంది గ్యాస్ బాయిస్ ఉన్నారు , ఎన్ని వాహనాలు ఉన్నాయి వారికి జీతం ఏ విధంగా ఇస్తున్నారు , ఎంతమందిని కంప్లైంట్స్ పై తీసివేశారు ,అన్న విషయాలను అడిగి తెలుసుకుని ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్యాస్ బాయ్స్ అదనపు సొమ్ము వసూలు చేయరాదని మరియు గ్యాస్ బాయ్స్ కు జీతం ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని ఆదేశించారు.
గ్యాస్ బాయ్స్ కు అందజేసే జీతాల వివరాలు మరియు సరఫరా కు వినియోగించే వాహనాల వివరాలు డిఎస్ఓ కార్యాలయానికి అందజేయాలని ఏజెన్సీ లను ఆదేశించారు. ఇకపై గ్యాస్ ఏజెన్సీలు ఎటువంటి పొరపాట్లు చేసిన ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ల పనితీరును సమీక్షించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి ఈ విషయాల పై తనిఖీలు జరిపి నివేదికలు అందజేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా పౌర సరఫరా అధికారి రాజా రఘువీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని 41 ఏజెన్సీల పనితీరును , ప్రజా సానుకూలత దృక్పథం వివరాలు సమావేశంలో వివరించారు. ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘు వీర్ , ఏడి మార్కెటింగ్ నారాయణ మూర్తి , సివిల్ సప్లై డిప్యూటీ తాహసీల్దారులు , గ్యాస్ కంపెనీ ల ప్రతినిధులు మరియు జిల్లా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.




