Kurnool: కర్నూలు హాస్టల్ వార్డెన్లపై కలెక్టర్ ఆగ్రహం
Kurnool: కర్నూలు కలెక్టర్ సిరి కీలక ఆదేశాలు. హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం.
Kurnool: కర్నూలు హాస్టల్ వార్డెన్లపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు: వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి వార్డెన్ బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన హాస్టల్ వార్డెన్లతో సంబధిత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...విద్యార్థులు ఇంటికి దూరంగా ఉంటున్నందున వారిని సొంత పిల్లలుగా భావించి ప్రతి అంశంలో జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. హాస్టళ్ల నిర్వహణలో నాణ్యత, క్రమశిక్షణ, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రోజూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థులందరికీ సరిపడా భోజనం సిద్ధం చేయాలని, అన్నం పూర్తిగా ఉడికేలా చూడాలని, కూరలు, సాంబారు, గుడ్లు, చిక్కీలు తదితర ఆహార పదార్థాలు నాణ్యతతో ఉండాలని సూచించారు. ఆహార నాణ్యతలో రాజీకి తావులేదని, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. హాస్టల్‌లో ఏ విద్యార్థికైనా అనారోగ్యం కలిగినా, ఆరోగ్య పరిస్థితి విషమించినా వెంటనే తన మొబైల్‌కు సందేశం ద్వారా సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలన్నారు.
హాస్టళ్లలో పనిచేస్తున్న వాచ్‌మెన్లు, వంట సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులందరికీ విద్యార్థుల భద్రత, ప్రవర్తనా నియమాలు, బాలల రక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం లేదా మంగళవారం లోపు ఈ కార్యక్రమాలను పూర్తి చేసి, వాటికి సంబంధించిన ఫోటోలను సంబంధిత శాఖ అధికారులకు పంపించాలని సూచించారు.
వార్డెన్, వాచ్‌మెన్, సెక్యూరిటీ సిబ్బంది లేదా ఇతర ఉద్యోగుల్లో ఎవరైనా విద్యార్థులతో అనుచితంగా లేదా అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.
తల్లిదండ్రులు హాస్టల్ సందర్శించినప్పుడు వారు సంతృప్తి చెందేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ సూచించారు. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ (RO) తాగునీటి ప్లాంట్లు ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేసేలా చూడాలని, భవనాల్లో అవసరమైన మరమ్మతులు పూర్తిచేయాలని, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్న విషయాన్ని వారికి వివరించాలని ఆదేశించారు.
హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులు, ప్రజల్లో సానుకూల (అభిప్రాయం, మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చేలా ప్రతి వార్డెన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హాస్టళ్లలోని స్టాక్ రిజిస్టర్లు, నిల్వల వివరాలు ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
స్టోర్‌రూమ్‌లో ఉన్న ఫిజికల్ స్టాక్, రికార్డులను తాను ఎప్పుడైనా తనిఖీ చేస్తానని, స్టాక్‌లో ఎలాంటి వ్యత్యాసాలు కనిపించినా సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు భద్రత, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ప్రతి వార్డెన్ బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, బి.సి వెల్ఫేర్ అధికారి ప్రసూన్న, మైనారిటీ వెల్ఫేర్ అధికారి సభిహ పర్వీన్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోకరాజు తదితరులు పాల్గొన్నారు.




