Kurnool: గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ డా. ఏ. సిరి!
Kurnool: హుసేనాపురం హౌసింగ్ లేఔట్‌లో గృహ నిర్మాణ పనులను కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశం.
Kurnool: గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి కలెక్టర్ డా. ఏ. సిరి!
కర్నూలు: గృహ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలోని హౌసింగ్ లేఔట్‌లో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. గృహ నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...గృహ నిర్మాణాల్లో బేస్‌మెంట్, రూఫ్ లెవల్, ఆర్సీ (RC) లెవల్, మరుగుదొడ్ల నిర్మాణం, తుది దశ పనులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి నిర్మాణ దశకు సంబంధించిన బిల్లుల సమర్పణ, ఆమోదం, చెల్లింపుల ప్రక్రియను సమీక్షించారు. నిబంధనల ప్రకారం బిల్లుల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి, లబ్ధిదారులకు నిర్మాణ పనులు కొనసాగించేందుకు అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు.
సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుకలు తదితర నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు, నిర్మాణానికి అవుతున్న వ్యయ వివరాలను స్థానికులు, సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన సామగ్రి లభ్యత, వ్యయాల వివరాలను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
నిర్మాణాల్లో పిల్లర్లు, స్లాబ్ నిర్మాణం, లీకేజీల నివారణ తదితర సాంకేతిక అంశాలపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ దశల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన పరిష్కారాలు చూపాలని సూచించారు. హౌసింగ్ లేఔట్‌లో తాగునీరు, విద్యుత్, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు.
గృహ నిర్మాణాలకు, లబ్ధిదారుల నివాసానికి అవసరమైన సదుపాయాల కల్పనలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి వెచ్చించిన ఖర్చు, నిర్మాణ పనుల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డి, తహశీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో ఏం. నాగ అనసుయ తదితరులు పాల్గొన్నారు.




