Kurnool: కీలక పనితీరు సూచికల లక్ష్యాల సాధనలో వెనుకబడిన శాఖలు పురోగతి సాధించాలి
Kurnool: కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి KPI లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేసి మెరుగైన గ్రేడ్ సాధించాలని ఆదేశం.
Kurnool: కీలక పనితీరు సూచికల లక్ష్యాల సాధనలో వెనుకబడిన శాఖలు పురోగతి సాధించాలి
కర్నూలు: జిల్లాలో వివిధ శాఖల పనితీరును ప్రతిబింబించే కీలక పనితీరు సూచికలు (KPI) లక్ష్యాల సాధనలో వెనుకబడిన శాఖలు పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంశం పై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, పనితీరు సూచికల్లో మెరుగైన గ్రేడ్ సాధించేలా పనిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ప్రభుత్వ శాఖలు తమ పనితీరు సూచికలను నిరంతరం సమీక్షించుకోవాలని, ప్రస్తుతం ఉన్న గ్రేడ్ నుంచి మెరుగైన గ్రేడ్‌కు చేరుకునేందుకు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
సుంకేశుల ప్రాంతంలో సిద్ధంగా ఉన్న చేప పిల్లలను అనుకూలమైన నీటి వనరుల్లో త్వరితగతిన విడుదల చేయాలని, చేప పిల్లల ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, సాధ్యమైన మేరకు లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ మత్స్యశాఖ డిడి ని ఆదేశించారు.
జిల్లాలో మధుమేహం, అధిక రక్తపోటు రోగుల స్క్రీనింగ్, తదుపరి వైద్య పరీక్షలు, చికిత్సల పురోగతికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలతో పోలిస్తే స్క్రీనింగ్, ఫాలోఅప్ సేవల్లో ఆశించిన పురోగతి సాధించలేదన్నారు. సంచార చికిత్స కార్యక్రమం ద్వారా మధుమేహం, రక్తపోటు రోగులకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన మందుల లభ్యతను పరిశీలించి, రోగుల ఫాలోఅప్‌ను మెరుగుపరచాలని కలెక్టర్ తెలిపారు.
గృహ నిర్మాణాలకు సంబంధించిన KPI సూచికల్లో జిల్లాకు మెరుగైన గ్రేడింగ్ సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ హౌసింగ్ పిడి ని ఆదేశించారు. గృహ నిర్మాణాల్లో వెనుకబాటుకు గల కారణాలను గుర్తించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.. గృహ నిర్మాణాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా సాధించి, KPIలో 'A' గ్రేడ్ సాధించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్షిక లక్ష్యం 4,200 కాగా, ఇప్పటివరకు సాధించిన పురోగతి లక్ష్యానికి అనుగుణంగా లేదని కలెక్టర్ పేర్కొన్నారు. నవంబర్ నెలాఖరులోగా కనీసం 3,000 నిర్మాణాలు పూర్తి చేసి, సీ-గ్రేడ్ నుంచి బీ-గ్రేడ్‌కు చేరుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ విభాగంలోనూ పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. నవంబర్ 18లోగా నిర్దేశిత లక్ష్యాలను సాధించి బీ-గ్రేడ్‌కు చేరుకోవాలని, అనంతరం జనవరి నాటికి ఏ-గ్రేడ్ సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దివ్యాంగులకు వినికిడి యంత్రాల పంపిణీకి సంబంధించి అందుబాటులో ఉన్న యంత్రాలను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. దివ్యాంగుల సంఖ్యను అంచనా వేసేందుకు అవసరమైన శిబిరాలను నిర్వహించకపోవడం వల్ల సంబంధిత పనితీరు సూచికల్లో ఆశించిన గ్రేడ్ సాధించలేకపోయారని, దివ్యాంగుల అంచనా శిబిరాల నిర్వహణలో జాప్యం చేయకుండా శిబిరాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం శాఖ అధికారిని ఆదేశించారు.
సమావేశంలో సిపిఓ భారతి, మత్స్యశాఖ డిడి రంగనాథ్ బాబు, ఏపిఎంఐపి పిడి శ్రీనివాసులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం శాఖ అధికారిని రాయిస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.




