Kurnool: తుంగభద్ర నదిలో ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ సిరి ఉక్కుపాదం!

Kurnool: తుంగభద్ర నదిలో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 23 May 2026 8:14 PM IST
Kurnool
X

Kurnool: తుంగభద్ర నదిలో ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ సిరి ఉక్కుపాదం!

Kurnool: తుంగభద్ర నది నుండి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా అరికట్టే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర నదిలో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. నదిలో స్పష్టమైన హద్దులు లేకపోవడం వల్ల తెలంగాణ వైపు నుంచి కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చి అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని కొంతలపాడు, దుద్యాల, ఎదురూరు, సుంకేసుల గ్రామాల పరిధిలోని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని సంయుక్త సర్వే నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. తుంగభద్ర నదిలో ఇరు రాష్ట్రాల పరిధులను స్పష్టంగా గుర్తించే విధంగా హద్దులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కొంతలపాడు, దూద్యాల, ఎదురూరు, సుంకేసుల గ్రామాల పరిధిలోని నదీ ప్రాంతాల్లో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా లేదా తవ్వకాలలో పాల్గొనే వాహనాలు పట్టుబడితే కోర్టు ఆదేశాలు లేకుండా విడుదల చేయవద్దని కలెక్టర్ పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, నదిలో అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ మనోహర్, డిపిఓ భాస్కర్, గనుల శాఖ అధికారి శివ పార్వతి, కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story