Kurnool: నదులు, కాలువల్లో చెత్త వేస్తే భారీ జరిమానా కమిషనర్ చల్లా

Kurnool: కర్నూలులో నదులు, కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు తప్పవని మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 13 Oct 2026 5:22 PM IST
Kurnool
X

Kurnool: నదులు, కాలువల్లో చెత్త వేస్తే భారీ జరిమానా కమిషనర్ చల్లా

కర్నూలు: నదులు, కాలువలు, నీటి ప్రవాహ మార్గాలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నగర ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. మంగళవారం కేసీ కెనాల్‌లోని వినాయక ఘాట్, రాజ్‌విహార్, వై. జంక్షన్, బిర్లా కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని, చెత్తను ఇష్టానుసారంగా పడేయడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. నదులు, కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలగడమే కాకుండా పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమలు, ఈగలు వృద్ధి చెందే ప్రమాదం ఉందన్నారు.

దీనివల్ల ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహం లేని నేపథ్యంలో, నిల్వ ఉన్న నీటిలో చెత్తాచెదారం వేయడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు.

అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన, నదులు, కాలువల్లో చెత్త వేస్తూ పరిసరాలను కలుషితం చేసే వారిపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఈ తరహా చర్యలను పర్యవేక్షించేందుకు కెమెరాలు ఉన్నాయని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఫరుక్, జిలానీ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL