Kurnool: కర్నూలులో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సదస్సు

Kurnool: నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR) పై అవగాహన సదస్సు జరిగింది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 12 Jun 2026 4:48 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సదస్సు

Kurnool: భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్‌ఐఆర్)ను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), ప్రజలు సమిష్టిగా సహకరించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. శుక్రవారం స్థానిక బాలాజీ నగర్‌లోని కర్నూలు కన్వెన్షన్ హాల్‌లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐఆర్ లక్ష్యాలు, విధివిధానాలు, బీఎల్‌ఏల పాత్ర, ప్రజల బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఆర్వో మాట్లాడుతూ.. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా, తప్పులులేనిదిగా రూపొందించడమే ఎస్‌ఐఆర్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, నకిలీ లేదా ద్వంద్వ నమోదులను గుర్తించి సరిచేయడం ఈ ప్రక్రియలో భాగమన్నారు. అర్హత కలిగిన ఏ ఓటును తొలగించబడదని స్పష్టం చేశారు.

ఈ నెల 15వ తేదీ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఓటరికి రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, వాటిని ఓటర్లు స్వయంగా పూర్తి చేసి బీఎల్‌వోలకు అందించాలని సూచించారు. ఒక ఫారంపై బీఎల్‌వో సంతకం చేసి రసీదు రూపంలో ఓటరుకు తిరిగి అందజేస్తారని వివరించారు.

ప్రజలు తమ ఈపిక్ (ఓటరు గుర్తింపు కార్డు), రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. 2002 సంవత్సరానికి సంబంధించిన ఓటరు జాబితా వివరాలు, పోలింగ్ కేంద్రం నంబర్, పార్ట్ నంబర్, వరుస సంఖ్య, తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మల ఈపిక్ వివరాలు అందుబాటులో ఉంటే మ్యాపింగ్ ప్రక్రియ మరింత సులభంగా జరుగుతుందని తెలిపారు. వివాహానంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు, ఇటీవల ఓటరుగా నమోదు చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

బీఎల్‌ఏలు ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ అనంతరం పేర్లు, వివరాలు సరిచూసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. ఓటరు జాబితాలో చేర్పులు, సవరణలు, అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి సమర్పించాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటరు జాబితా తయారీలో రాజకీయ పార్టీలు, బీఎల్‌ఏలు, ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story