Kurnool: బ్లాక్ స్పాట్ల వద్ద పనులను త్వరితగతిన పూర్తి చేయండి.. అధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశం!
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ డా. ఏ. సిరి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Kurnool: బ్లాక్ స్పాట్ల వద్ద పనులను త్వరితగతిన పూర్తి చేయండి.. అధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశం!
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా బ్లాక్ స్పాట్ ల వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్హెచ్ కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు ప్రతిపాదిత అంశానికి సంబంధించి మున్సిపల్, ఆర్&బి, ఏపీఎస్ఆర్టీసీ శాఖల అధికారులు కలిసి సంయుక్త తనిఖీ నిర్వహించాలని గత సమావేశంలో చెప్పినప్పటికీ కూడా జాయింట్ ఇన్‌స్పెక్షన్ ఇంకా పూర్తి కాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ ఇన్‌స్పెక్షన్ త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచలింగాల టోల్గేట్ నుండి వెల్దుర్తి వరకు మరియు ఆదోని పట్టణం నూతన బైపాస్ రోడ్డు నుండి మంత్రాలయం వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్ ల వద్ద నివారణ చర్యలు త్వరితగతిన తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి (ఎన్‌హెచ్-167) పరిధిలో ఎమ్మిగనూరు–మంత్రాలయం మార్గంలో గుర్తించిన బ్లాక్ స్పాట్ ల వద్ద పనులు ఎంతవరకు వచ్చాయని కలెక్టర్ సంబంధిత అధికారిని ఆరా తీశారు.. పనులన్నీ పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ కి వివరించారు.
పిస్తా హౌస్ నుండి ఉలిందకొండ వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్ లో హైమాస్ లైట్ ఏర్పాటు చేయాలని గత సమావేశంలో చెప్పడం జరిగిందని ఎటువంటి చర్యలు తీసుకున్నారని కలెక్టర్ సంబంధిత నేషనల్ హైవే అనంతపురం అధికారిని ఆరా తీశారు.. గుర్తించిన బ్లాక్ స్పాట్ లలో హై మాస్ లైట్లకు ప్రత్యామ్నాయంగా ప్రమాదకర ప్రాంతాల్లో డబుల్ ఆర్మ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని నేషనల్ హైవే అనంతపురం అధికారి కలెక్టర్ కు వివరించారు. దీర్ఘకాలిక అభివృద్ధి పనుల కింద రూ.254 కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఇప్పటికే ఒప్పందం పూర్తయిందని, ఈ ప్రాజెక్టులో సర్వీస్ రోడ్లు, వాహనాల అండర్‌పాస్‌లు (VUPలు), డ్రైనేజ్ నిర్మాణాలు, సోలార్ లైటింగ్ వంటి పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదనంగా రూ.60 కోట్లతో మరో రహదారి అభివృద్ధి ప్రాజెక్టును కూడా మంజూరు చేశారని, ఈ ప్రాజెక్టు కింద కర్నూలు ఐటీసీ ఫ్లైఓవర్ నుంచి అమ్మకతాడు టోల్ ప్లాజా వరకు రహదారికి ఓవర్లే పనులు, రోడ్ స్టడ్స్ ఏర్పాటు, రహదారి మార్కింగ్ పనులు చేపట్టనున్నారని, సంబంధిత పనులను 2 నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ నేషనల్ హైవే అనంతపురం వారిని ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రయాణికులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందేలా ఎంట్రీ పాయింట్ల వద్ద దిశా నిర్దేశక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నేషనల్ హైవే మహబూబ్ వారిని ఆదేశించారు.
కిడ్స్ వరల్డ్ నుండి కలెక్టరేట్ కాంప్లెక్స్ వరకు చేపట్టనున్న రోడ్ విస్తరణ పనులలో వేగం పెంచి వచ్చే నెలలో గణనీయమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. నగర అభివృద్ధి, ట్రాఫిక్ రద్దీ నివారణ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలన్నారు.
ఉల్చాల జంక్షన్ అభివృద్ధికి సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్‌ల మార్పిడి పనులు పూర్తయ్యాయని, కేబుల్ లేయింగ్, విద్యుత్ సంబంధిత మిగిలిన పనులు పూర్తి అవ్వగానే వచ్చే నెల నాటికి ఉల్చాల జంక్షన్ అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగర సంగీకరణలో భాగంగా చేపట్టిన గుంతలు పూడ్చే పనులలో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారుల వెంట అనధికార ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించడం, అవసరమైన చోట జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయడం, రోడ్డు మార్కింగ్‌లు పూర్తి చేయడం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ నేపథ్యంలో అన్ని ఇంజినీరింగ్ శాఖల అధికారులు, పోలీసు మరియు ఇతర సంబంధిత శాఖలతో కలిసి ప్రత్యేక జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించాలని కలెక్టర్ డిటిసి నీ ఆదేశించారు. తనిఖీల అనంతరం ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు, జీబ్రా క్రాసింగ్‌లు, రోడ్డు భద్రతా సూచికల ఏర్పాటు వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ డిటిసి ని ఆదేశించారు.
ఎన్‌హెచ్-44 ఈనాడు కార్యాలయం నుండి మిస్టర్ ఇడ్లీ వరకు సర్వీస్ రోడ్లపై ఉన్న ఆక్రమణల తొలగింపుకు సంబంధించి మున్సిపల్ శాఖ, జాతీయ రహదారుల అధికారులు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన (జాయింట్ ఇన్‌స్పెక్షన్) నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలకు కనీసం 500 మీటర్ల ముందుగానే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డి టీ సీ ని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో రహదారుల ఇరువైపులా పెరిగిన చెట్లు, బ్లైండ్ కర్వ్స్ వద్ద ఉన్న పొదలను క్లీన్ చేయకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని వెంటనే శుభ్రం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్కిల్ వద్ద ప్రమాదాలు జరుగకుండా స్పీడ్ బ్రేకర్ లు వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్ నుండి హైవే రోడ్డు మీదకి ఎక్కే సమయంలో వాహనదారులు ఎక్కువ స్పీడ్ లో వస్తున్నారని తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని, హైవే రోడ్డు మీదికి ఎక్కే ముందు వాహనం యొక్క వేగం నియంత్రించడానికి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. హిట్ అండ్ రన్ కి సంబంధించి బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాల్సిన కేసులు పెండింగ్ లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
సమావేశంలో అదనపు ఎస్పి హుస్సేన్ పీరా, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డిటిసి శాంతకుమారి, పంచాయతీ రాజ్ ఎస్ఈ ప్రభాకర్ రెడ్డి, డీఎంహెచ్వో డా. కామేశ్వర ప్రసాద్, నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.




