Kurnool: రైతులకు నోటీసులు ఇచ్చాకే రీ-సర్వే.. కలెక్టర్ కీలక ఆదేశాలు

Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో ఐదో విడత రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పరిశీలించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 April 2026 3:48 PM IST
Kurnool
X

Kurnool: రైతులకు నోటీసులు ఇచ్చాకే రీ-సర్వే.. కలెక్టర్ కీలక ఆదేశాలు

Kurnool: జిల్లాలో చేపట్టిన రీ-సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రతి రైతుకు ముందస్తు నోటీసులు తప్పనిసరిగా అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. మంగళవారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో జరుగుతున్న 5వ దశ రీ-సర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో సుమారు 10,542 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న రీ-సర్వే పనులను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ-సర్వే ప్రక్రియలో పొలం సరిహద్దుల నిర్ధారణ, భూమి రికార్డుల సమీక్ష, రోవర్ సాంకేతిక విధానాల వినియోగం వంటి అంశాలను జాగ్రత్తగా అమలు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా, సమయపాలన పాటిస్తూ రీ సర్వే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీ-సర్వేలో భాగంగా రైతులకు ముందస్తు సమాచారం అందించడం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి రైతుకు వ్యక్తిగతంగా నోటీసులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

రైతుల సహకారం లేకుండా ఈ ప్రక్రియ విజయవంతం కాదని, కాబట్టి వారికి పూర్తి అవగాహన కల్పిస్తూ పారదర్శకంగా ముందుకు సాగాలని తెలిపారు. అదే విధంగా, వేసవి కాలంలో భూములను ఖాళీగా ఉంచకుండా పీఎండీఎస్ పద్ధతిలో వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా భూ సంబంధిత వివాదాలు తగ్గిపోవడంతో పాటు రైతుల హక్కులు మరింత బలపడతాయని కలెక్టర్ తెలిపారు.

కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, జిల్లా సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story