Kurnool: కర్నూలు ఓటర్లకు అలర్ట్.. రేపటి నుంచే ఇంటింటికీ బీఎల్వోలు

Kurnool: కర్నూలు నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) - 2026 కార్యక్రమం జూన్ 15 నుండి ప్రారంభం కానుంది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 14 Jun 2026 9:25 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు ఓటర్లకు అలర్ట్.. రేపటి నుంచే ఇంటింటికీ బీఎల్వోలు

కర్నూలు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) - 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సోమవారం నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని కర్నూలు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమం జూన్ 15 నుంచి జూలై 14 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంబంధిత బీఎల్వోతో పాటు వారికి సహకరించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు సైతం వస్తారని తెలిపారు. ప్రతి ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, అందులో 2002 సంవత్సరంలో ఓటరు లేదా ఓటరు సంబంధికులు (తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు) ఏ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం నంబర్, పార్ట్ నంబర్, వరుస నంబర్‌లో నమోదై ఉన్నారో సంబంధిత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.

అలాగే రెండు హాఫ్ సైజు ఫొటోలు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఓటరు నుంచి ఫారాలు స్వీకరించిన అనంతరం బీఎల్వో ఒక ఎన్యూమరేషన్ ఫారంపై సంతకం చేసి ఎక్నాలెడ్జ్‌మెంట్‌గా తిరిగి ఓటరుకు అందిస్తారని స్పష్టం చేశారు.

కావున నియోజకవర్గంలోని ఓటర్లు 2002లో తమకు లేదా తమ సంబంధికులకు ఎక్కడ ఓటు ఉండేదో సంబంధించిన వివరాలు, ఓటరు, ఓటరు సంబంధికుల ఈపిక్ కార్డులు, రెండు ఫొటోలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరించాలని, బీఎల్వోలు కోరిన పత్రాలు, వివరాలను అందించాలని కోరారు.

సరైన సమాచారాన్ని అందించడం ద్వారా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనకు తోడ్పడాలని ఈఆర్వో, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సంబంధిత బీఎల్వోలు లేదా ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story