Kurnool: రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవు!
Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ కమిటీ సమావేశం. బియ్యం, కందిపప్పు, నూనె ధరల పరిమితిపై జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశాలు.
Kurnool: రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవు!
Kurnool: జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ, రాష్ట్ర సగటు ధరల కంటే తక్కువగా లేదా కనీసం రాష్ట్ర సగటుకు అనుగుణంగా వినియోగదారులకు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల అధికారులు, వ్యాపారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిత్యావసర వస్తువుల ధరలపై జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, హోల్సేల్ రైస్ అసోసియేషన్ లు, రిటైల్ అసోసియేషన్ ల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ధరల పరిస్థితిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులకు సంబంధించి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ధరలు అకస్మాత్తుగా తగ్గితే రైతులు నష్టపోయే అవకాశం ఉందని, అదే విధంగా అధికంగా పెరిగితే వినియోగదారులపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు లేకుండా స్థిరత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాధారణ మార్కెట్ పరిస్థితులకు మించి అసాధారణంగా పెరిగిన వస్తువుల ధరలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని జేసీ పేర్కొన్నారు. పెద్ద నగరాల్లో రవాణా, అద్దెలు, ఇతర నిర్వహణ వ్యయాల కారణంగా కొంత ధరల వ్యత్యాసం ఉండవచ్చని, అయితే జిల్లాలో రాష్ట్ర సగటు కంటే అధిక ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయించడం సమంజసం కాదన్నారు.
సరుకుల కొనుగోలు ధరకు అనుగుణంగా సహేతుకమైన మార్జిన్ మాత్రమే తీసుకోవాలని వర్తకులకు సూచించారు. బియ్యం, కందిపప్పు, నూనెలు, చక్కెర తదితర సరుకుల హోల్‌సేల్, రిటైల్ ధరల మధ్య ఉన్న పప్పుధాన్యాలు, చక్కెర, సన్‌ఫ్లవర్ ఆయిల్, బియ్యం వంటి ప్రధాన నిత్యావసర వస్తువుల హోల్‌సేల్, రిటైల్ ధరల మధ్య వ్యత్యాసాన్ని సమీక్షిస్తూ, రాష్ట్ర సగటుకు అనుగుణంగా ఉండేలా విక్రయాలు ఉండాలని జేసీ ఆదేశించారు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు సివిల్ సప్లైస్, జీఎస్టీ, లీగల్ మెట్రాలజీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు టీములుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ధరలు అదుపులోకి రాకపోతే నిబంధనల మేరకు అవసరమైన చర్యలు, ఆంక్షలు విధించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
నిర్ణయించిన ధరలకే విక్రయాలు ఉండాలి
ధరల నియంత్రణ కమిటీ నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే వినియోగదారులకు నిత్యావసర వస్తువులను విక్రయించాలని జేసీ అసోసియేషన్ ప్రతినిధులను ఆదేశించారు. సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం( 8 నెలల పాత బియ్యం) కిలో రూ.56, కందిపప్పు కిలో రూ.117, ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.178, పంచదార కిలో రూ.57 లకు అమ్మాలని జేసీ ఆదేశించారు.
ఇతర నిత్యావసర వస్తువులను కూడా రాష్ట్ర సగటు ధరలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు బజార్లలో కూడా ఉల్లిపాయల ధరలు నియంత్రణలో ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఎస్టేట్ అధికారులను ఆదేశించారు.
రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లు
జిల్లాలోని సి. క్యాంప్ రైతు బజార్, వెంకట రమణ కాలనీ రైతు బజార్, కొత్తపేట రైతు బజార్, ఆదోని రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఏర్పాటు చేసి, 8 నెలల పాత సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52, పచ్చి బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. బియ్యం నాణ్యతను ల్యాబ్ పరీక్షల ద్వారా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల బియ్యం అందజేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి, లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీ రాములు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




