Kurnool: సేవా సంకల్ప్ అభియాన్: కర్నూలు జీజీహెచ్‌లో ఉచిత వైద్య శిబిరం
Kurnool: సేవా సంకల్ప్ అభియాన్–2026లో భాగంగా కర్నూలు సర్వజన వైద్యశాలలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అన్ని స్పెషాలిటీల వైద్యులు రోగులకు సేవలందించారు.
Kurnool: సేవా సంకల్ప్ అభియాన్: కర్నూలు జీజీహెచ్‌లో ఉచిత వైద్య శిబిరం
కర్నూలు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సేవా సంకల్ప్ అభియాన్–2026 లో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శనివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. చిట్టి నరసమ్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ మెగా వైద్య శిబిరంలో కార్డియాలజీ, సైకియాట్రీ, మెడికల్ ఆంకాలజీ తదితర అన్ని ప్రధాన వైద్య విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలు, అవసరమైన చికిత్సా సేవలు అందించారు. వీటితో పాటు బ్లడ్ బ్యాంక్, ఎక్స్‌రే, HIV, NTEP, NLEP తదితర ప్రత్యేక సేవలను కూడా ఒకే వేదికపై అందుబాటులో ఉంచారు. ప్రజలకు అవసరమైన వివిధ రకాల వైద్య సేవలను ఒకే చోట అందించడం ద్వారా ఈ శిబిరం ఉపయోగకరంగా నిలిచింది.
DMHO డా. కామేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా. కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. మెగా మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు, ఆరోగ్య సలహాలు మరియు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందస్తు పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో DMHO డా కామేశ్వర ప్రసాద్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా కె వెంకటేశ్వర్లు గారితో పాటు రీజనల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా సత్య నారాయణ రెడ్డి, DCHS డా జఫ్రుల్లా, లేప్రోసి ఆఫీసర్ డా భాస్కర్ మరియు లయేజెన్ ఆఫీసర్స్ మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




