Kurnool: కర్నూలులో రూ.2.04 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన

Kurnool: కర్నూలు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. రూ.2.04 కోట్ల ఎన్‌క్యాప్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 5 Sept 2026 4:49 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో రూ.2.04 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన

కర్నూలు: నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రహదారులు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి వసతులు, ఉద్యానవనాలు, వీధి దీపాలు తదితర అభివృద్ధి పనులను సమగ్రంగా చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్ పేర్కొన్నారు. శనివారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి రూ.2.04 కోట్ల నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్) నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కంట్రోల్ రూం నుంచి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ సర్కిల్ వరకు, అలాగే సుంకేసుల రోడ్డు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీ నుంచి రెండు వాగుల వరకు సెంట్రల్ మీడియన్ డివైడర్ నిర్మాణానికి రూ.1.66 కోట్లతో కంట్రోల్ రూం వద్ద శంకుస్థాపన చేశారు. అలాగే మార్కెట్ యార్డ్ వెనుక బస్టాండ్ నుంచి ఎస్‌ఏపీ క్యాంపు మార్గంలో రూ.38 లక్షల వ్యయంతో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మంత్రి మాట్లాడుతూ.. నగరంలో సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం, ఎన్‌క్యాప్ తదితర పథకాల ద్వారా రూ.88.06 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోపు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా కొండారెడ్డి బురుజు నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి కూడలి, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ మీదుగా వై.జంక్షన్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రూ.2.23 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

వీటితో పాటు 14 కూడళ్లు, ప్రధాన రహదారుల వెంట అవసరమైన చోట్ల రూ.30 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో రోడ్ మార్కింగ్స్, సెంటర్ లైన్స్, ఎడ్జ్ లైన్స్, లేన్ లైన్స్, జీబ్రా క్రాసింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ వంటి సూచికలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా వాహనదారులు, పాదచారులకు స్పష్టమైన మార్గదర్శకత్వం కల్పించడంతో పాటు రహదారి భద్రతను పెంచుతున్నామని చెప్పారు. నగరానికి సరికొత్త శోభ తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తూ, సుందరీకరణ, పచ్చదనం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. 9 ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కూడళ్లలో టర్ఫ్ గడ్డి ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న వాటర్ ఫౌంటెన్లను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాన రహదారుల వెంట ఉన్న డివైడర్లకు ఆకర్షణీయమైన రంగులు వేయడం, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టడం, నడకబాటలను అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని తెలిపారు. రహదారుల వెంట పచ్చదనం మరింత పెరిగేలా మొక్కలు నాటడంతో పాటు, ఇప్పటికే ఉన్న మొక్కలను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

నగరానికి ప్రధాన ప్రవేశ మార్గాలుగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రాంతాలుగా కూడళ్లు ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కూడలిని ప్రత్యేకంగా తీర్చిదిద్దేలా డిజైన్లు రూపొందిస్తున్నామని తెలిపారు. గోడలపై ఆహ్లాదకరమైన చిత్రాలు, పచ్చదనం, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్ వంటి అంశాలను సమన్వయం చేసి నగరానికి సరికొత్త రూపాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎంఈ మనోహర్ రెడ్డి, గిరిరాజ్, ఏఈ ఖాసిం, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మునిస్వామి, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story