Kurnool: చిన్న సాయం.. గొప్ప పుణ్యం! అన్న క్యాంటీన్లకు దాతల చేయూత కావాలి
Kurnool: కర్నూలు నగరంలోని అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు.
Kurnool: చిన్న సాయం.. గొప్ప పుణ్యం! అన్న క్యాంటీన్లకు దాతల చేయూత కావాలి
కర్నూలు : కుటుంబ శుభకార్యాలు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, స్మారక దినాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ‘అన్న క్యాంటీన్ల’కు విరాళాలు అందించి పేదలకు అన్నదానం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నగర ప్రజలకు పిలుపునిచ్చారు. సమాజంలోని నిరుపేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణలో సంపన్నుల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పేదవారికి అన్నం పెట్టడంలో లభించే ఆనందం, సంతృప్తి ఎంతో గొప్పదని తెలిపారు. నగరంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి అన్న క్యాంటీన్ల నిర్వహణకు తోడ్పాటు అందించాలని కోరారు. అన్న క్యాంటీన్లలో అల్పాహారం ఒక్కో ప్లేట్‌కు రూ.22 వ్యయం అవుతుండగా ప్రభుత్వం రూ.17 సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. అలాగే మధ్యాహ్న, రాత్రి భోజనానికి ఒక్కో ప్లేట్‌పై రూ.34 వ్యయం అవుతుండగా ప్రభుత్వం రూ.29 సబ్సిడీ భరిస్తోందన్నారు. అందరి సహకారంతో మరింత మందికి భోజన సేవలు అందించగలమని కమిషనర్ పేర్కొన్నారు. నగరంలో 6 అన్న క్యాంటీన్లు ఉన్నాయని, ఒకరోజు ముందే విరాళం చేస్తే, దాత కోరిన రోజు భోజనం అందిస్తామని పేర్కొన్నారు. ఎక్కువ మొత్తంలో చెల్లించే దాతలు నగరపాలక కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
విరాళాలు అందించే దాతల వివరాలను అన్న క్యాంటీన్ స్క్రీన్‌లో ప్రదర్శించడంతో పాటు ప్రభుత్వం అభినందన సర్టిఫికెట్ అందజేస్తుందని తెలిపారు. కమిషనర్ పిలుపు మేరకు నగరపాలక సంస్థ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ తన తల్లి స్మారకార్థం అన్న క్యాంటీన్‌లో మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చును విరాళంగా అందించారు. దీంతో అతన్ని కమిషనర్ ఆయనను అభినందించారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.




