Kurnool: పనిలో క్రమశిక్షణ తప్పనిసరి: సిబ్బందికి కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరిక!
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
Kurnool: పనిలో క్రమశిక్షణ తప్పనిసరి: సిబ్బందికి కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరిక!
కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగం పొందాక క్రమశిక్షణ లేకుండా అందించే సేవలతో ప్రయోజనం ఉండదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. సోమవారం చెక్‌పోస్ట్, రాజ్‌విహార్, పెద్దపాడు ప్రాంతాల్లో కమిషనర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానిక వై. జంక్షన్ వద్ద చెత్తతో నిండిన డస్ట్‌బిన్‌లు, పుష్‌కార్టులు ఉండటంతో ఆరా తీశారు. కాంపాక్టర్ డ్రైవర్ విధుల్లో క్రమశిక్షణ లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కమిషనర్ దృష్టికి సంబంధిత శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ తీసుకువచ్చారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కమిషనర్, వెంటనే డ్రైవర్‌ను బదిలీ చేయాలని ఆదేశించారు. చెత్తా తరలింపు జరగకపోతే పారిశుద్ధ్య పనులు సజావుగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం లోపించే పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతర శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ల సహాయం తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలన్నారు. సిబ్బందిపై నియంత్రణ పెట్టలేకపోతే పైఅధికారులకు ఫిర్యాదు చేయాలని, బాధ్యతారాహిత్యంగా పనిచేయోద్దని హితవు పలికారు.
అలాగే పెద్దపాడు పలు వీధుల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రధాన రహదారి ఇరువైపులా, వీధుల్లోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, అపరిశుభ్రత ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే స్వచ్ఛత పనులు చేపట్టాలని, వారం తర్వాత మళ్లీ వస్తానని, పరిస్థితి మారకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
అనంతరం ఇటీవల రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్ గుప్తా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు అశోక్‌నగర్ పంప్ హౌస్, పున్నమి హోటల్ వెనుక ఉన్న మున్సిపల్ స్థలాలను కమిషనర్ పరిశీలించారు. వీలైనంత త్వరగా అనువైన స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎస్‌ఈ రమణమూర్తి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ షాలిబాష తదితరులు పాల్గొన్నారు.




