Kurnool: ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్దాం కర్నూలు నగరపాలక కమిషనర్ పిలుపు!
Kurnool: కర్నూలులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ తనిఖీలు ముమ్మరం. రూ.1.95 లక్షల జరిమానా విధించినట్లు కమిషనర్ చల్లా ఓబులేసు వెల్లడి.
Kurnool: ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్దాం కర్నూలు నగరపాలక కమిషనర్ పిలుపు!
Kurnool: పర్యావరణానికి ప్రజారోగ్యానికి హానికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు వ్యాపారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం పాత బస్టాండ్ ప్రాంతంలోని దుకాణాలను సందర్శించి, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు.
కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్ విక్రయాలు వినియోగాన్ని వ్యాపారులు ప్రజలు స్వచ్ఛందంగా పూర్తిగా నిలిపివేయాలని కోరారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు నగరపాలక సంస్థ నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 201 దాడులు నిర్వహించి 250 కిలోలకు పైగా నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.1,95,150 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్లాస్టిక్‌కు బదులుగా వస్త్ర, కాగిత సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు.
అలాగే ప్రతి వ్యాపార సంస్థ తమ దుకాణం ముందు తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలని, చెత్తను రోడ్లపై వేయకుండా అందులోనే వేయాలని సూచించారు. నగర పరిశుభ్రతకు ప్రతి వ్యాపారి భాగస్వామి కావాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంతకుముందు సుంకేసుల రోడ్డు, ఎన్.ఆర్.పేట తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, సానిటరీ సూపర్వైజర్ రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.




