Kurnool: కర్నూలు కళాశాలలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ నాగరాజు శెట్టి.
Kurnool: కర్నూలు కళాశాలలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో భారత జాతీయ పతాక రూపకర్త, మహనీయుడు పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు శెట్టి హాజరై మాట్లాడుతూ, పింగళి వెంకయ్య దేశభక్తి, జాతీయ పతాక రూపకల్పనలో చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తి, జాతీయ గౌరవానికి ప్రతీక అని, ప్రతి విద్యార్థి జాతీయ పతాకాన్ని గౌరవించడం తన బాధ్యతగా భావించాలని సూచించారు.
ఈ కార్యక్రమం ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పింగళి వెంకయ్య జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసిన మహనీయుల ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని అన్నారు. విద్యతో పాటు విలువలను అలవరచుకున్నప్పుడే సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.
విద్యార్థులు పింగళి వెంకయ్య జీవిత విశేషాలను వివరిస్తూ ప్రసంగాలు చేయడంతో పాటు దేశభక్తి గీతాలను ఆలపించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, ఉల్గోజి రావు, బాల శంకర్, లావణ్య పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం చివర్లో భారత జాతీయ పతాక విశిష్టతను, పింగళి వెంకయ్య చేసిన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిస్తూ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.




