Kurnool: రూ.1.20 కోట్ల విలువైన 589 మొబైల్ ఫోన్లు రికవరీ
Kurnool: కర్నూలులో రూ.1.20 కోట్ల విలువైన 589 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్ వాడాలని సూచించారు.
Kurnool: రూ.1.20 కోట్ల విలువైన 589 మొబైల్ ఫోన్లు రికవరీ
కర్నూలు: కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం 6 వ మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు మరియు స్థానిక పోలీసులు రికవరీ చేసిన 589 మొబైల్ ఫోన్లను, సుమారు రూ.1 కోటి 20 లక్షల విలువైన ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ బాధితులకు అందజేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
ఆరు విడతల మొబైల్ రికవరీ కార్యక్రమాల్లో ఇప్పటివరకు రూ. 7.36 కోట్ల విలువైన 3,670 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు.
ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ కేవలం ఆర్థిక విలువ కలిగిన వస్తువు మాత్రమే కాదని, బ్యాంకింగ్ లావాదేవీలు, ఫోన్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారం, జ్ఞాపకాలు వంటి అనేక ముఖ్యమైన వివరాలు అందులో ఉంటాయన్నారు.
అందువల్ల మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఆర్థిక నష్టంతో పాటు బాధితులు భావోద్వేగపరమైన ఆందోళనకు గురవుతున్నారన్నారు.
బాధితుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఐటీ కోర్ టీమ్, సైబర్ ల్యాబ్ పోలీసులు, స్థానిక పోలీసులు సమన్వయంతో ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లను రికవరీ చేసి తీసుకొచ్చారన్నారు. రికవరీ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పొరుగు రాష్ట్రాల నుంచి కర్నూలు పోలీసులు రికవరీ చేశారన్నారు.
1) జి.ఎస్. రవికుమార్ (ఫారెస్ట్ ఆఫీస్ ఏవో, కర్నూలు): కర్నూలులో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను హైదరాబాద్‌లో గుర్తించి కర్నూలు టూటౌన్ పోలీసులు రికవరీ చేశారు.
2) టి. శిరీష (పిఠాపురం): మంగళగిరిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను బెంగళూరులో గుర్తించి ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు రికవరీ చేశారు.
3) ఎం. రంజిత్ (కడప): తమిళనాడులో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను తమిళనాడులో గుర్తించి ఉలిందకొండ పోలీసులు రికవరీ చేశారు.
4) పి. సాంబశివుడు (కర్నూలు): కర్నూలులో పోయిన మొబైల్ ఫోన్‌ను మహారాష్ట్రలో గుర్తించి కర్నూలు తాలూకా పోలీసులు రికవరీ చేశారు.
5) ఎస్. దానం (పేపర్ బాయ్, కర్నూలు): కర్నూలు, సి.క్యాంప్ లో పోయిన మొబైల్ ఫోన్‌ను తమిళనాడులో గుర్తించి కర్నూలు త్రీటౌన్ పోలీసులు రికవరీ చేశారు.
ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి ..
ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా ఆందోళన చెందకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో వెంటనే మొబైల్ IMEI నంబర్, ఇతర వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.
CEIRలో నమోదు చేసిన వివరాల ఆధారంగా పోలీసులు మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేసి రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు.
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత వివరాలను CEIR లో నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు మధుసూదన్ రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ ఎస్‌ఐలు వెంకట మోహన్ ఆశాలత, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.




