Kurnool: కర్నూలు పోలీసుల చేతికి వింత యాప్.. ఒక్క క్లిక్‌తో గుట్టురట్టు!
Kurnool: కర్నూలు జిల్లాలో మిస్సింగ్ కేసులను ఛేదించడానికి పోలీసులు సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు.
Kurnool: కర్నూలు పోలీసుల చేతికి వింత యాప్.. ఒక్క క్లిక్‌తో గుట్టురట్టు!
కర్నూలు : మిస్సింగ్ కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న కర్నూలు పోలీసులు CCTNS AP 360 యాప్ ద్వారా FRS (Facial Recognition System) టెక్నాలజీతో మిస్సింగ్ కేసులను ఛేదిస్తున్న పోలీసులు. కనిపించకుండా పోయిన వ్యక్తులను గుర్తించడంలో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నదని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ గారు ఆదివారం తెలిపారు. మిస్సింగ్ కేసుల ఛేదనలో కర్నూలు జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ గారు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సర్వీసుల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,000 అనలిటిక్స్ కెమెరాలు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా సుమారు 722 మ్యాట్రిక్స్ స్మార్ట్ టెక్నాలజీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కెమెరాల్లో FRS (Facial Recognition System), ANPR (Automatic Number Plate Recognition) మరియు ఇతర అనలిటిక్స్ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కెమెరాలన్నీ అమరావతిలోని RTGS (Real Time Governance Society) కంట్రోల్ రూమ్ ద్వారా CCTNS AP 360 యాప్ సహాయంతో మానిటర్ చేయబడుతున్నాయని, అలాగే అన్ని జిల్లా కంట్రోల్ రూమ్‌లు మరియు పోలీస్ స్టేషన్లతో అనుసంధానించబడినట్లు వివరించారు.
ఇటీవల కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన వ్యక్తిని మదనపల్లిలో గుర్తించినట్లు తెలిపారు. అలాగే పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులో బాధితుడిని తిరుపతిలో, నందవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో వ్యక్తిని విజయవాడలో గుర్తించి సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న FRS (Facial Recognition System) టెక్నాలజీ ద్వారా మిస్సింగ్ వ్యక్తుల ఆచూకీ కోసం వేగవంతమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సాంకేతికత మిస్సింగ్ కేసుల ఛేదనలో అత్యంత కీలకంగా ఉపయోగపడుతున్నదన్నారు. FRS కెమెరాలు వ్యక్తుల ముఖాలను గుర్తించే ఆధునిక సాంకేతిక వ్యవస్థ అని తెలిపారు. ఈ కెమెరాలు వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసి, పోలీసుల డేటాబేస్‌లో ఉన్న ఫోటోలతో పోల్చి ఆ వ్యక్తిని గుర్తిస్తాయని వివరించారు.
అదేవిధంగా, ప్రాపర్టీ ఆఫెండర్లు, కేసుల్లో పరారీలో ఉన్న నిందితులు మరియు నేరచరిత్ర కలిగిన వ్యక్తుల అనుమానాస్పద కదలికలపై కూడా ఈ కెమెరాల ద్వారా కర్నూలు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వెంటనే అలర్ట్‌లు అందుతున్నాయని తెలిపారు.
ఈ టెక్నాలజీని ముఖ్యంగా:
* మిస్సింగ్ వ్యక్తుల గుర్తింపు
* నేరస్తుల ట్రాకింగ్
* దొంగిలించబడిన వాహనాల గుర్తింపు
కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, దేవాలయాలు, మసీదులు, స్టేడియాలు, మార్కెట్ యార్డులు, రద్దీగా ఉండే షాపింగ్ కాంప్లెక్స్‌లు, ట్రాఫిక్ జంక్షన్లు వంటి ప్రాంతాల్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు లేదా వాహనాలు కనిపించకుండా పోయిన సందర్భాల్లో ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని తక్షణ చర్యలు చేపడుతున్నామని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ గారు తెలిపారు.




