Kurnool: ఆగస్టు 30న నీట్ పీజీ ఆన్‌లైన్ పరీక్ష పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్
Kurnool: కర్నూలు జిల్లాలో ఆగస్టు 30న జరిగే నీట్ పీజీ ఆన్‌లైన్ పరీక్షకు 7 కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
Kurnool: ఆగస్టు 30న నీట్ పీజీ ఆన్‌లైన్ పరీక్ష పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్
కర్నూలు: జిల్లాలో ఆగస్టు 30వ తేదీన నిర్వహించనున్న నీట్ పీజీ–2026 ఆన్‌లైన్ పరీక్షకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం నీట్ ఆన్‌లైన్ పరీక్షల ఏర్పాట్ల పై ఆర్డీఓ లతో, మున్సిపల్ కమిషనర్ లతో, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 30 వ తేదీన నీట్ పిజి -2026 ఆన్‌లైన్ పరీక్షను 7 పరీక్ష కేంద్రాల్లో (కర్నూలు-5, ఆదోని -1, ఎమ్మిగనూరు -1) నిర్వహిస్తున్నారని, 2114 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని కలెక్టర్ తెలిపారు.. నీట్ పీజీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుందని, ఉదయం 7:00 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారన్నారు. ఉదయం 9:00 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు.. పరీక్షల నిర్వహణకు లైజన్ ఆఫీసర్లను, నోడల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు.. కర్నూలు లోని పరీక్ష కేంద్రాలకు కర్నూలు ఆర్డీవో, కర్నూలు మున్సిపల్ కమిషనర్ లను, ఆదోని లోని పరీక్ష కేంద్రానికి డ్వామా పిడి ని, ఎమ్మిగనూరు లోని పరీక్ష కేంద్రానికి ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ లు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారన్నారు.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయనున్నందున పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా అంశాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.. పరీక్షల సమయాలు, ఇతర నిర్వహణ అంశాల విషయంలో సంబంధిత పరీక్ష నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. పరీక్షల భద్రత విషయంలో పోలీసు శాఖతో పాటు సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచే బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతించాలన్నారు. స్పై కెమెరాలు, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచీలు, పేపర్లు తదితర నిషేధిత వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించరాదన్నారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన వైద్య, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ లు, అవసరమైన మెడిసిన్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డీఎంహెచ్‌ఓ, జీజీహెచ్‌లో సూపరింటెండెంట్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ లను ఆదేశించారు.
కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నియమించిన నోడల్ అధికారులు, లైజన్ అధికారులు, సంబంధిత పోలీసు అధికారులు పరస్పర సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు.. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, డ్వామా పిడి నరసింహ రెడ్డి, డీఎంహెచ్వో డా.కామేశ్వర ప్రసాద్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు..




